ORR | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కాంట్రాక్టు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. టోల్ -ఆపరేట్ -ట్రాన్స్ఫర్ (టీవోటీ) లీజు అంతా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టంచేశారు. కాంట్రాక్టు సంస్థ ఓఆర్ఆర్పై టోల్ రేట్లను ఇష్టారీతిన పెంచడానికి వీలులేదని, 2012 టోల్ టాక్స్ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. టీవోటీలో బేస్ప్రైస్ను నిర్ణయించామని, దానికంటే ఎక్కువకు బిడ్ వేసిన సంస్థకే కాంట్రాక్టు ఖరారు చేశామని వెల్లడించారు. బేస్ప్రైస్ను ఎన్హెచ్ఏఐ బయటపెట్టడంలేదని, అందుకే తాము కూడా బహిర్గతం చేయలేదని తెలిపారు. ఓఆర్ఆర్-టీవోటీపై బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని ఎన్ఐయూఎం కార్యాలయంలో అర్వింద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓఆర్ఆర్పై ముందుగా అంచనా వేసినదానికంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే సంస్థకు కేటాయించిన 30 సంవత్సరాల పరిమితి తగ్గుతుందని తెలిపారు. కొందరు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం బాధించిందని అన్నారు. తాను ఎక్కడికీ పోలేదని, విధుల్లోనే ఉన్నానని స్పష్టంచేశారు.
2022 ఆగస్టు 11న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 30 సంవత్సరాలకు ఓఆర్ఆర్ను టీవోటీ ప్రాతిపదికన లీజుకు ఇచ్చేందుకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని అర్వింద్‌కుమార్ తెలిపారు. ఎన్హెచ్ఏఐ కోసం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ 2016 ఆగస్టు 3న ఆమోదించిందని గుర్తుచేశారు. ఆ విధానం ప్రకారమే ఎన్హెచ్ఏఐ ఇప్పటివరకు 1600 కిలోమీటర్లకుపైగా రోడ్లను టీవోటీ పరిధిలోకి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఈ బిడ్లలో 30 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉన్నదని తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా టీవోటీ ప్రాజెక్టును అమలు చేసిందని చెప్పారు. ఆ నిబంధనలనే ఓఆర్ఆర్ విషయంలో అమలు చేశామని స్పష్టంచేశారు.
ఓఆర్ఆర్పై ట్రాఫిక్ సాధారణంకంటే ఎక్కువ పెరిగితే లీజు కాల వ్యవధి 30 సంవత్సరాల కంటే తగ్గుతుందని, ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి సంస్థ కార్యకలాపాలను ప్రభుత్వం సమీక్షిస్తుందని అర్వింద్‌కుమార్ తెలిపారు. 10, 20వ సంవత్సరాల్లో ఈ సమీక్ష ఉంటుందని చెప్పారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు మొత్తం బిడ్ దక్కించుకున్న సంస్థే నిర్వహిస్తుందని వెల్లడించారు. కాంట్రాక్టు సంస్థ బిడ్ మొత్తాన్ని చెల్లించడానికి 120 రోజుల సమయం ఇస్తామని తెలిపారు. ఓఆర్ఆర్పై ఏడు సంస్థలు స్వయంగా ట్రాఫిక్‌ను అంచనా వేశాయని చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన మజార్స్ ఐడ్వెజరీ ఎల్ఎల్పీ అనే కన్సల్టింగ్ సంస్థ ఓపెన్ బిడ్ ప్రక్రియకు లావాదేవీ సలహాదారుగా ఉన్నదని, ఈ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేపట్టే పీపీపీ ప్రాజెక్టులను చేపట్టే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం సలహాదారులుగా ఎంపానెల్ అయిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు సంస్థ ఓఆర్ఆర్పై టోల్ రేట్లను ఇష్టారీతిన పెంచడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ టోల్ పాలసీ 2012 ప్రకారమే సంస్థ నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఓఆర్ఆర్ టీవోటీకి బిడ్లను 2022 నవంబర్ 9న ఆహ్వానించామని ఆర్వింద్ కుమార్ తెలిపారు. ఈ అంతర్జాతీయ బిడ్‌లో పాల్గొనడానికి అనేక సంస్థలు ముందుకొచ్చాయని, ఈ సంస్థల అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొదటిసారి, తర్వాత ఫిబ్రవరి 28 వరకు, చివరిగా మార్చి 31 వరకు తేదీలను పొడిగించామని చెప్పారు. మొత్తం 142 రోజుల బిడ్ ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. ఆదానీ సంస్థ లిఖితపూర్వకంగా గడువు పొడిగించాలని ఎప్పుడూ అడగలేదని చెప్పారు. 11 సంస్థలు బిడ్లు వేస్తే ప్రైస్బిడ్లకు 4 సంస్థలు అర్హత సాధించాయని, వాటిలో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7,380 కోట్లకు బిడ్ వేసి మొదటిస్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ సంస్థకు ఏప్రిల్ 27న లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ (ఎల్వోఏ) జారీ చేశామని వివరించారు. దేశంలో అతిపెద్ద అసెట్ మానిటైజేషన్ డీల్‌లలో ఇదీ ఒకటని తెలిపారు. రాష్ట్రాల రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన అత్యుత్తమ బిడ్లలో ఒకటని పేర్కొన్నారు.
రెరా చైర్మన్, సభ్యులను ఎంపిక చేయడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్, లా సెక్రటరీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ప్రభుత్వం కమిటీ వేసిందని, ఈ కమిటీ ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమైందని అర్వింద్‌కుమార్ తెలిపారు. చైర్మన్ పోస్టుకు 37 దరఖాస్తులు, ఇద్దరు సభ్యుల కోసం 59 దరఖాస్తులు వచ్చాయని, మూడు వారాల్లో ఒక్కో పోస్టుకు మూడు పేర్లను ప్రభుత్వానికి కమిటీ సూచిస్తుందని చెప్పారు. చైర్మన్ కోసం దరఖాస్తు చేసినవారిలో ఆరుగురు ప్ర స్తుత ఐఏఎస్‌లు ఉన్నారని వెల్లడించారు.
ఓఆర్ఆర్ నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.500 కోట్ల రుణాన్ని చెల్లించామని, మరో రూ.2,711 కోట్లను జైకా నుంచి తీసుకొన్నామని అర్వింద్‌కుమార్ తెలిపారు. ఇంకా రూ.2,038 కోట్ల రుణం చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. 2018-19లో ఓఆర్ఆర్పై రూ.340 కోట్ల ఆదాయం వస్తే, 2022-23లో రూ.542 కోట్లు వచ్చిందని వివరించారు. ఓఆర్ఆర్పై కొన్నేండ్లుగా 6-7 శాతం ట్రాఫిక్ పెరుగుతున్నదని, రోజుకు సగటున 1.65 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. రోజుకు రూ.1.48 కోట్ల ఆదాయం వస్తున్నదని తెలిపారు. ఓఆర్ఆర్పై మరో మూడు ఇంటర్ చేంజ్‌లు రాబోతున్నాయని, వాటిని నిర్మించి కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ట్రామా కేర్ సెంటర్లను కూడా కొత్త సంస్థ నిర్వహించాల్సి ఉంటుందని, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థను కొనసాగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు వ్యవహారంలో కొందరు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆర్వింద్ కుమార్ అన్నారు.