హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వడగాలులు, ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్లకు అత్యవసర సూచనలు చేసింది. హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించింది. ప్రధాన కూడళ్లు, జనసమర్థ ప్రదేశాల్లో కూలింగ్ సెంటర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరింది. రెడ్‌క్రాస్, ఎన్జీవోలు, సామాజిక సంస్థలతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. వడగాలుల కారణంగా మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒకరూ అప్రమత్తంగా ఉండాలని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో అగ్నిమాపక శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించి, భవనాన్ని ఖాళీ చేయించాలని సూచించారు.