హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ, రవాణాశాఖ తనకు రెండు కండ్ల లాంటివని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతో రవాణారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతిలో తనకు భాగస్వామ్యం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోపాటు అందరి సహకారంతో తన బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.