హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండిచేయి చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. హైదరాబాద్లో మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి విజయవంతంగా కొనసాగుతున్నది. దీనికి అనుసంధానంగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశను పలు మార్గాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది.
ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయినప్పటికీ బేఖాతరు చేసిన కేంద్ర ప్రభుత్వం రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంకు రూ.3,596 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు ఢిల్లీ నుంచి ఘజియాబాద్ మీదుగా మీరట్ వరకు నిర్మిస్తున్నారు. తెలంగాణకు అవసరమైన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నదని పలువురు నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగాన్ని నిరుత్సాహ పర్చే బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగాన్ని నిరుత్సాహపర్చేలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైంది రియల్ ఎస్టేట్ రంగం. దీనికోసం కేంద్రం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తుందని ఆశించాం. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం, అదేవిధంగా ఆదాయ పన్ను పరిమితిని మరో 2 లక్షలకు పెంచడం వల్ల మధ్య తరగతి వర్గాలకు కొంతవరకు మేలు జరుగుతుంది.
-జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్