మహబూబాబాద్ : గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఆదివాసీ గిరిజన సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
హైదరాబాద్లో ఒక్కొక్కటి రూ.22 కోట్లతో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను సీఎం ఈనెల 17వ తేదీన ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో సభా కార్యక్రమం ఉంటుందన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్ష 25 వేల మంది సభకు హాజరు కానున్నారని, మహబూబాబాద్ జిల్లా నుంచి పదివేల 666 మంది సభకు హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. పేద గిరిజన జీవితాలతో ముడిపడే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు.
పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక అనుసరించి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, త్వరలోనే లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి కై 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.