హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి మరోసారి సమర్పించాలని తెలంగాణ సర్కారు తుదకు నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో జలసౌధలో శుక్రవారం మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర అంశాలు, ఎన్జీటీ కేసులు, ప్రాజెక్టుల డీపీఆర్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో పాలమూరు ప్రాజెక్టుపైనా మంత్రి చర్చించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్ఎల్ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారంచుట్టింది.
మైనర్ ఇరిగేషన్లో వినియోగించుకొని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను మొత్తంగా 90టీఎంసీల నికర జలాలను పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సమర్పించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) నుంచి పర్యావరణ అనుమతుల కోసం 34వ ఈ ఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలను చేసింది. ఎట్టకేలకు 49వ ఈఏసీ అంగీకరించింది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఏడాదిన్నర గడిచినా కేంద్రం అనుమతులను మంజూరు చేయలేదు.
కాంగ్రెస్ వచ్చాక తీరని జాప్యం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం ఏకంగా డీపీఆర్‌ను తిప్పి పంపింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీల వివరాలు ఇవ్వాలని అడిగినా, లేఖలు రాసినా కాం గ్రెస్ సర్కారు స్పందించడం లేదని సీడబ్ల్యూసీ ఆక్షేపించింది. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా 45టీఎంసీల అంశం కూడా ట్రిబ్యునల్ పరిధి లో ఉన్నదని వెల్లడించింది. దానిపైనా స్పష్టత ఇవ్వాలని లేఖలు రాసినా స్పందించడం లేదని తెలిపింది.