BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఈ నెల 9వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని ఎస్ఎల్పీలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందనీ పిటిషన్ లో పేర్కొంది. ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంతమేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సమగ్ర, శాస్త్రీయ అధ్యయనం తెలంగాణలో జరిగిందని.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలు ఉన్నారని తెలిపింది. రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తావించింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు మూడు నెలల్లోపు గవర్నర్ ,రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే వాటికి ఆమోదముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని.. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొంది.