హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.12,500 కోట్ల రుణాలు సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెల 1న రూ.7 వేల కోట్లు, 7న రూ.3 వేల కోట్ల రుణాలు సమీకరించిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మంగళవారం (ఈ నెల 14న) రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మరో రూ.2,500 కోట్ల అప్పు తెచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఒకే నెలలో ఇంత భారీగా అప్పులు తీసుకోవడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ఎన్నో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తాము అధికారంలోకి రాగానే రుణాల సమీకరణ వేగాన్ని మరింత పెంచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసినప్పటికీ ఎన్నడూ ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. నోట్ల రద్దు, కొవిడ్ లాంటి అనుకోని విపత్తులు ఎదురైనప్పటికీ రుణాల సమీకరణలో కేసీఆర్ సర్కార్ ఎన్నడూ గీత దాటలేదు. కానీ, ప్రస్తుత రేవంత్ సరార్ మాత్రం రైతుభరోసా పేరుతో ఇష్టారాజ్యంగా అప్పులు తేవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినెలా ప్రభుత్వం సమీకరిస్తున్న రుణాల పరిమాణం ఊహించని విధంగా పెరిగిపోతున్నది. గత మూడేండ్లలో ఏప్రిల్ నుంచి జూలై వరకు తీసుకున్న అప్పులే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రేవంత్ సర్కార్ ఏకంగా రూ.31,400 కోట్ల రుణాలు సమీకరించింది. నిరుడు జూలైలో రూ.8 వేల కోట్లు, 2024 జూలైలో రూ.8,500 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఈ నెలలో 14 నాటికే రూ.12,500 కోట్లకు చేరడం సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచుకోకుండా అప్పులపైనే ఆధారపడుతూ రేవంత్రెడ్డి పాలన సాగిస్తుండటంతో భవిష్యత్తులో తెలంగాణ కోలుకోలేని సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
