కొడంగల్, జూలై 30: బీఆర్ఎస్తోనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కాపాడుకోవడానికి యత్నిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం బొట్లవోనితండాలో 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తండాలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్నం మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, బీఆర్ఎస్కు పూర్తి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అధికారులను బెదిరించి వారి వర్గీయులకే పథకాలను అందిస్తున్నట్టు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన సర్వేల్లో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉందని గుర్తించడంవల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జంకుతున్నట్టు తెలిపారు. కాలయాపన చేస్తూ.. బీసీ రిజర్వేషన్ అంటూ మరో కొత్త డ్రామా మొదలెట్టినట్టు తెలిపారు.