Talasani : పంచ సూత్రాలను పాటించడం ద్వారానే మానవులు మోక్షాన్ని పొందగలుగుతారని సూచించిన మహనీయుడు మహావీర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహావీర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహావీర్ సూచనలు, బోధనలు అనుసరించదగినవని పేర్కొన్నారు. జైన్ సేవా సంఘ్ మహావీర్ బోధనలను అనుసరించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచిందని తెలిపారు. జైన్ సేవా సంఘ్‌కు ఒక అద్బుతమైన భవనం ఉండాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ భగాయత్‌లో స్థలం కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.
జైన్ సమాజ్‌కు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, వారు చేసే కార్యక్రమాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వాహకులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమలో జైన్ సేవా సంఘ్ అధ్యక్షులు యోగేష్ సింఘి, మైనారిటీ కమిషన్ సభ్యులు హిమాన్షు బాప్నా, అశోక్ జైన్, సురేష్ సురానా, కైలాష్ బండారీ, సుభాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.