హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయినుంచి దేశ రాజధాని వరకూ.. విదేశాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకొన్న అమరవీరుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఈ పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తుచేసుకొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ప్రతినిధి లారెంట్ ట్రిపోనే విశిష్ట అతిథిగా విచ్చేశారు. తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాలను విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రం కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ తన్నీరు మహేశ్ నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు సిద్దిపేట వాస్తవ్యులు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో అవతరణ సంబురాలు ఘనంగా నిర్వహించారు.