హైదరాబాద్: వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా అగ్నిమాపక శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి తెలిపారు. వేసవిలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రతి నిమిషం సంసిద్ధులై ఉండాలని సిబ్బందికి సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ వరకు అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఏడీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. సోమవారం నుంచి శుక్రవారం వరకు విధిగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఏటా సుమారు 7,500 నుంచి 8,000 వరకు ఫైర్‌కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నామని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ఎప్పుడు కాల్ వచ్చినా నిమిషాల్లోనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లో అధికారులు నిత్యం తనిఖీలు చేపట్టాలని, ఇది నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.
వరుస ప్రమాదాల దృష్ట్యా 15 వేల లీటర్లకు పైగా ఫోమ్ కాంపౌండ్‌ను కొనుగోలు చేశామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి అవగాహన కార్యక్రమాలకు వాహనాలతో వెళ్లాలని సిబ్బందికి సూచించారు. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే టెక్నిక్స్, తోటివారిని కాపాడే విధానం, చిన్నచిన్న మంటలను ఆర్పడం, వాహనాలతో బాధితులను కాపాడే విధానాన్ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. వేసవి కాలం కావడంతో ప్రజలు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల యజమానులు, పరిశ్రమల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భవనాలు, కాంప్లెక్సుల్లో ఎప్పటికప్పుడు ఫైర్ ఫైటింగ్ వ్యవస్థను తనిఖీ చేసుకోవాలని ఏడీజీ సూచించారు. ప్రజలను కాపాడతామనే నమ్మకాన్ని మనమే ఇవ్వాలని సిబ్బందికి ఉపదేశించారు.
అగ్నిమాపక వాహనాలతో ర్యాలీ
అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ వరకు అగ్నిమాపక వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఏడీజీ నాగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో.. అగ్నిమాపక శాఖ వద్ద అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలను వినియోగించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. హైటెక్స్ గ్రౌండ్స్ నుంచి మొదలై మాదాపూర్, మెటల్ చార్మినార్, సైబర్ టవర్స్, ఎన్ఐఏ బిల్డింగ్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, వైజంక్షన్, సనత్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, రవీంద్రభారతి, సెక్రటేరియట్, లిబర్టీ ఎక్స్‌రోడ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, నిజాం కాలేజీ, అబిడ్స్, కోటి, చాదర్ఘట్, మలక్‌పేట్, దిల్‌షుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ సర్కిల్, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, పాట్నీ, ఇంపీరియల్ గార్డెన్స్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజలు అగ్నిమాపక వాహనాలపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జీవీ నారాయణరావు, రీజనల్ ఆఫీసర్ పాపయ్య, జీహెచ్ఎంసీ డీఎఫ్ఓ, ఏడీఎఫ్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.