Telangana | హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులకు దక్కాల్సిన ఎరువులు పంజాబ్‌కు తరలిపోతున్నాయి. తెలంగాణ రైతులను గాలికొదిలేసి, పంజాబ్ రైతులకు ఎరువుల కొరత తీర్చేందుకు కంపెనీలు తహతహలాడుతున్నాయి. సదరు కంపెనీలకు మార్క్‌ఫెడ్‌లోని కొందరు కింది స్థాయి అధికారులు సహకరిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన మేర డీఏపీ లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ర్టానికి కేటాయించిన ఎరువుల ర్యాక్స్ (రైలులో వచ్చే ఎరువులు) వచ్చినప్పటికీ, వాటిని ఇక్కడ దిం చుకోకుండా తిరిగి పంపించేసినట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులు కంపెనీలతో కలిసి గూడుపుఠాణి నడిపినట్టు సమాచారం. రాష్ర్టానికి రేక్స్ వచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా దాచేసినట్టు తెలిసింది. నవంబర్ నెల మొత్తం ఇదే తతంగం జరిగినట్టు సమాచారం.
పంజాబ్‌కు తరలింపు…!
ఈ సీజన్లో దేశవ్యాప్తంగా డీఏపీ కొరత నెలకొన్నది. పలు దేశాల్లో యుద్ధాల నేపథ్యం లో డీఏపీ తయారీకి అవసరమైన ముడిసరు కు ధరలు పెరగడంతో కంపెనీలు డీఏపీ దిగుమతిని, తయారీని తగ్గించేశాయి. దీంతో పంజాబ్, హర్యానాతోపాటు పలు ఉత్తరాది రాష్ర్టాల్లో తీవ్రంగా కొరత ఉన్నది. ఆయా రాష్ర్టాల్లో కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మిగిలిన రా ష్ర్టాల కేటాయింపుల్లో కోత పెట్టినట్టు తెలిసింది. తెలంగాణకు ఇవ్వాల్సిన ఎరువులను దొడ్డదారిలో తగ్గించేందుకు ఎరువుల కంపెనీలతో కథ నడిపించినట్టు తెలిసింది. రాష్ర్టానికి కేటాయించిన ఎరువులను రాష్ర్టానికి ఇవ్వకుండా పంజాబ్‌కు తరలించినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సదరు కంపెనీలు వ్యవసాయ కమిషనరేట్, మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులను మచ్చిక చేసుకున్నట్టు తెలిసింది. రేకులు వచ్చిన విషయం ఉన్నతాధికారులకు చెప్పొద్దని సూచించినట్టు తెలిసింది. దీంతో రేకులు ఇక్కడికి రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి.
అలా బయటపడింది
రాష్ట్రంలో డీఏపీ కొరత నేపథ్యంలో మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి 3 రోజుల క్రితం జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఎరువు ల నిల్వలపై ఆరా తీయడంతో రాష్ర్టానికి వచ్చి న ఎరువులు పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్‌లో పలుమార్లు రేకులు రా ష్ర్టానికి వచ్చినప్పటికీ వాటిని ఇక్కడ దించుకోలేదని తేలింది. దీనిపై ఎరువుల విభాగం అధికారిని ఎండీ ఆరా తీ యగా, ఎరువుల రేకులు వచ్చిన విషయం త నకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ అధికారి నిర్లక్ష్యంపై ఎండీ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. డీఏపీ కొరత ఉన్నప్పు డు రేకులు ఎందుకు దించుకోలేదని, కంపెనీ లు ఎరువులు ఇచ్చేందుకు నిరాకరిస్తే ఆ విష యం తమ దృష్టికి ఎందుకు తీసుకొనిరాలేదని నిలదీసినట్టు తెలిసింది. తమ దృష్టికి తీసుకొస్తే ఏపీసీ, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కంపెనీలతో మాట్లాడి మనకు ఎరువులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసేవాళ్లం కదా? అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇందుకు సదరు అధికారి మౌనమే సమాధానమైట్టు తెలిసింది.
చేతులెత్తేసిన ప్రభుత్వం
డీఏపీ ఎరువుల కొరత కారణంగా తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు మార్క్‌ఫెడ్ వద్ద, అటు ప్రైవేటు ట్రేడర్ల వద్ద అంతా కలిపి రెండు వేల టన్నులు కూడా డీఏపీ నిల్వ లు లేవని తెలిసింది. ఉత్తరాది రాష్ర్టాల్లో డీఏపీ కొరత ఏర్పడటంతో అక్కడి ప్రభుత్వాలు కేంద్రంతో చర్చలు జరిపి ఎక్కువ డీఏపీని సరఫరా చేయించుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో పరిస్థితి నెలకొన్నది. డీఏపీ కొరతపై ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడంతో రైతులకు కష్టాలొచ్చాయి.