దామరచర్ల, నవంబర్ 15: ఏడాది క్రితం వరకు ధాన్యం ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఏపీకి తరలిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.2,300- రూ.2,400 వరకు ధర నిర్ణయిస్తున్నారు. సరిహద్దు గ్రామాల నుంచి వందల సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు ఏపీకి వెళ్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కూడా ధాన్యం అమ్మిన గిట్టుబాటు ధరతో ఇవ్వకుండా తరువాత బ్యాంకులో జమచేస్తారని అధికారులు తెలిపారు. సన్నధాన్యం 17 మ్యాచర్ రావాలంటే వడ్లను మార్కె ట్, కల్లాల్లో ఎండపెడితే 20 కేజీల వరకు తరుగుపోతుంది. మిర్యాలగూడ మిల్లుల కు వెళ్తే పట్టించుకోకపోవడంతో ఏపీకి తరలిస్తున్నామని చెబుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మండలానికి పది వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. వారం పదిరోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేవి. గతంలో గిట్టుబాటు ధర రూ.2,800 వరకు వచ్చిందని, నేడు బోనస్ పెట్టి 17 మ్యాచర్ పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆంధ్రా నుంచి తెలంగాణకు ధాన్యం వచ్చేది. చెక్‌పోస్టుల వద్ద ఆపి వాటిని వెనక్కి పంపించేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచే ఏపీకి తీసుకెళ్లాల్సిన పరిస్థతి ఎదురైంది.
ముందుగా పంటను అకాల వానలు దెబ్బతీశాయి. చీడపీడలు నష్టపరిచాయి. చేతికొచ్చాక స్థానికంగా కేంద్రాలు లేకపోవడం ఇబ్బందులకు గురిచేస్తున్నది. మరికొన్ని చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లలో ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నది. దీంతో రైతన్నకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. తేమశాతం లేకుండా రూ. 500బోనస్‌తో పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.