Irrigation minister | నీళ్లు ఉత్త’మ్’చ్చటే.. ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు..!
Irrigation minister | ఒకవైపు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు.. మరోవైపు ఉన్న నీళ్లను వాడుకోలేని అసమర్థత.. కనీసం చెరువులు, కుంటలు నింపుదామన్న సోయిలేని ప్రభుత్వం. కాలువలకు నీళ్లిచ్చి పంటలను కాపాడుకుందామన్న ధ్యాసలేని కాంగ్రెస్ మంత్రులు.
- ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్ల కరువు
- నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టులో దైన్యం
- నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భజలాలు
- బోర్లు, బావులపైనే ఆధారపడి రైతుల వరి సాగు
- 10 నుంచి 20 వేల ఎకరాల పంటపై ప్రభావం
- పొట్టకొచ్చిన పంటను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు
- ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు
- ఇప్పటికైనా నీళ్లివ్వకుంటే అన్నదాతల బతుకు ఆగమే
ఒకవైపు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు.. మరోవైపు ఉన్న నీళ్లను వాడుకోలేని అసమర్థత.. కనీసం చెరువులు, కుంటలు నింపుదామన్న సోయిలేని ప్రభుత్వం. కాలువలకు నీళ్లిచ్చి పంటలను కాపాడుకుందామన్న ధ్యాసలేని కాంగ్రెస్ మంత్రులు. ఫలితంగా పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. కండ్లెదుటే ఎండిపోతున్న పంటలను కాపాడుకునే దారి లేక, చివరకు వాటిలో పశువులను మేపుతున్న దైన్యం. ఇదీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని దుస్థితి. అక్కడి రైతుల దయనీయ గాధ.

Farmers
నల్లగొండ ప్రతినిధి/గరిడేపల్లి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గమే సాగు నీళ్ల కోసం అలమటిస్తున్నది. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక, నెర్రెలు బారిన పొలాల్లోని వరి పైరు తల వాలుస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో గత యాసంగిలో 1,38,232 ఎకరాల్లో వరి పంట సాగైంది.
ఈసారి నాగార్జునసాగర్‌లో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో యాసంగికి అధికారికంగా సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు బోర్లు, బావుల మీద ఆధారపడి వరి సాగుకు ఉపక్రమించారు. ఇప్పటికే ఉన్న బోర్లు, బావులకు తోడు కొత్తగా బావులు తవ్వుకుంటూ, బోర్లు వేస్తూ పంటలు పండించేందుకు తమ సర్వశక్తులూ ధారపోస్తున్నారు. ఈ సీజన్లో సుమారు 85 వేల ఎకరాల్లో వరి సాగైనట్టు అంచనా. ప్రారంభంలో బోర్లు, బావుల్లో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం అడుగంటి పోతున్నాయి.
గతంలో పంటల చివరి దశలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయంగా స్పందించి, నీళ్లను విడుదల చేసింది. రైతులను ఆదుకున్నది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షాత్తు నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

10 వేల ఎకరాల్లో ఎండిన పంటలు
గత రెండువారాలుగా ఎండ తీవ్రత పెరుగుతుండటం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దాంతో బోర్లు, బావుల కింద సాగుచేసిన వరి పంటకు నీళ్లు అందడం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకున్నట్టు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మరో 10 వేల ఎకరాలపై ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇప్పటికైనా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నీటిని విడుదల చేసి పొట్ట దశలో ఉన్న పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు. తక్షణమే ఒక విడత, పక్షం రోజుల్లో మరో విడత నీటిని విడుదల చేస్తే యాసంగి పంట గట్టెక్కుతుందని భావిస్తున్నారు. మంగళవారం గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన రైతులు ఎండిన వరి పొలంలో ఆందోళనకు దిగారు. చేతిలో పురుగుమందు డబ్బాలు పట్టుకుని నీటిని విడుదల చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.
సాగర్ నీటిమట్టం 518 అడుగులు
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 518 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది. డెడ్‌స్టోరేజీ లెవల్ 510 అడుగులు కాగా రానున్న వేసవిలో రెండు తెలుగు రాష్ర్టాల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని వినియోగించనున్నారు. గతంలో కూడా డెడ్ స్టోరేజీ లెవల్లోనూ చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పటిమాదిరిగానే 2015లో కూడా నాగార్జునసాగర్‌కు వరద రాకపోతే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న నీటినే పంటల కోసం విడుదల చేసి రైతులను ఆదుకున్నది. ఆ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో సాగర్‌లో 508 అడుగుల నీరు మాత్రమే ఉన్నప్పటికీ, యాసంగి వరి పంటను కాపాడేందుకు రెండు వారాలపాటు సాగునీటిని విడుదల చేసింది. అప్పటి కంటే ప్రస్తుతం 10 అడుగుల నీరు అదనంగానే ఉన్నదని, సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, నీళ్లు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం
- కల్మల్చెర్వు గ్రామానికి చెందిన బెడదల రంగారెడ్డి అనే కౌలు రైతు చెవ్వారిగూడెం గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి దగ్గర మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. బోరు, బావిపై ఆధారపడి వరి సాగు చేశాడు. వరి పంట పొట్ట దశలో ఉండగా పూర్తిగా ఎండిపోయింది.
- అదే గ్రామానికి చెందిన యడవెల్లి కోటిరెడ్డి అనే కౌలు రైతు గుండెబోయినగూడెంకు చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. ఎకరాకకు పది బస్తాల చొప్పున కౌలు మాట్లాడుకున్నారు. గ్రామ సమీపంలోని వాగుకు వేసిన లిప్ట్‌పై ఆధారపడి సాగు చేశాడు. ఇప్పుడు వాగు కూడా అడుగంటింది. దీంతో నీళ్లు అందక వరి పొలం నెర్రెలు బారింది. ఈనెలు బారే దశలో ఉన్న వరి మొక్కలు నేలకు వాలాయి.
- పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన బోగాల సైదిరెడ్డి అనే కౌలురైతు అదే గ్రామానికి చెందిన ఏ సైదయ్య నుంచి మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. రెండు బావులపై ఆధారపడి సాగు చేశాడు. బావుల్లో నీరు ఊరక మూడెకరాల పొలం మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఇలా కౌలు రైతులు పెట్టుబడులు వెళ్లక, కౌలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.మరికొద్ది రోజులు పంటను కాపాడుకుంటే చేతికందుతుందనే ఉద్దేశంతో రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం ఉన్నచోట ఈ స్థితిలో కూడా కొత్తగా బోర్లు వేయిస్తున్నారు.
ఉత్తమ్.. పొలం ఎండిపోతున్నదయ్యా..
- హుజూర్నగర్ నియోజకవర్గం కల్మల్చెర్వు గ్రామానికి చెందిన రైతు మూలగుండ్ల చిన్న వీరారెడ్డికి మూడు ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలం మధ్య నుంచే నాగార్జునసాగర్ కాల్వ వెళ్తుంది. గత పదేండ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వరి సాగు చేసుకుంటున్నాడు. ఈ వానకాలం సీజన్లో సాగర్ నీరు రాకపోయినప్పటికీ మూడెకరాల్లో వరి పండించాడు. ఈ సీజన్లో సైతం బోరుపై ఆధారపడి వరినాటు పెట్టాడు. పంట బాగా పెరిగి ఈనుతుండటంతో ఇబ్బంది లేదనుకున్నాడు. పంట పూర్తిగా ఈని, అర్రు వంగుతున్న సమయంలో బోరు వట్టిపోయింది. మరో పది రోజులు ఆగితే పంట ఇంటికొచ్చేది. కానీ, ఇప్పుడు నీరు లేక ఎండిపోయింది.
- గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొల్లగాని వెంకన్నకు గానుగుబండకు వెళ్లే దారిలో రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. ఒక బోరు, ఒక బావిపై ఆధారపడి వరి పంట వేశాడు. పొట్టదశలో ఉండగా బోరు, బావుల్లోని నీరు ఇంకిపోవడంతో పైరు ఎండిపోయింది.
- పాలకవీడు మండలం జాన్‌పహాడ్ గ్రామంలో షేక్ ఖాసిమ్ అనే రైతు రెండు బోర్లు కింద నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. అవి అడుగంటి పోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది.
- మేళ్లచెరువు మండలం హేమ్లాతండా పంచాయతీ పరిధిలోని సాధుతండాకు చెందిన రైతు ధరావత్ సైదా తన పొలంలోని బోరు ఎండిపోవడంతో ఎకరం విస్తీర్ణంలో పొలం వదిలేయాల్సి వచ్చింది. ఇలా దాదాపు పది వేల ఎకరాల్లో వరి పంట ప్రస్తుతం ఎండిపోతున్నది. దీంతో చేసేదేమీలేక పలువురు రైతులు ఇప్పటికే ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్న దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మూడెకరాలు ఎండిపోయింది
వ్యవసాయం చేయడం తప్ప నాకు ఏమీ తెలీదు. పొలం కౌలుకు తీసుకుని వరి నాటిన. పంట పూర్తిగా ఈని, అర్రు వంగిన దశలో నీరు లేకపోవడంతో మూడెకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక్క పదిరోజులు పొలం పారి ఉంటే పంట చేతికొచ్చేది. మరో పది రోజుల్లో నీరు ఇవ్వకపోతే చాలామంది రైతులకు నాలాంటి పరిస్థితే వస్తుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగర్ నీటిని విడుదల చేయించి రైతులకు అండగా నిలబడాలి.
– బెడదల రంగారెడ్డి, రైతు, కల్మల్చెర్వు, గరిడేపల్లి మండలం
సాగర్ నీటిని విడుదల చేయాలి
రాత్రనక, పగలనక పొలం దగ్గరే ఉంటూ పసిపాప లెక్క పంటను కాపాడుకుంటూ వచ్చినం. పొలాలు ఇప్పుడిప్పుడే అర్రు వంగుతున్నయ్. మరో రెండు తడులు పారిస్తే వడ్లు పండుతయ్. ఇప్పుడు బోర్లు, బావుల్లో నీరు ఊరుతలేదు. చాలా పొలాలు ఎండిపోయినయ్. మిగిలిన పొలాలు కూడా చేతికందడం అనుమానమే.. నాగార్జునాసగర్లో నీళ్లున్నయి కాబట్టి ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకుని వారం, పది రోజుల పాటు నీటిని విడుదల చేస్తే గట్టెక్కుతాం.
– గుజ్జుల శంభిరెడ్డి, రైతు కొండాయిగూడెం, గరిడేపల్లి మండలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

