Telangana Farmers | కాంగ్రెస్‌కు ఓటెయ్యం.. కరెంటు కోసం తండ్లాడం.. పొలాలను ఎండబెట్టుకోం.. మోటర్లను కాలబెట్టుకోం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్ణాటక రైతుల్లా తాము కోరికోరి కష్టాలు తెచ్చుకోం అంటున్నారు తెలంగాణ అన్నదాతలు. మూడు గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు అంటూ మాట్లాడే కాంగ్రెసోళ్లకు అసలు ఎవుసం తెలుసా? రేవంత్‌రెడ్డి తలకాయ ఉన్నోడేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లను నమ్మి ఓటేస్తే సబ్స్టేషన్లు పేలిపోతయ్, పంటలన్నీ ఎండిపోతయ్ అని కుండబద్దలు కొడుతున్నారు. ఖర్మ కాలి ఆ పార్టీకి ఓటేస్తే అంతకుమించిన దద్దమ్మ పని ఇంకోటి ఉండదని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటేసి బాధలు పడాల్నా?
నాడు కాంగ్రెస్ పాలనలో బాయి, బోర్లకు మోటర్లు పెడితే ఎకరం పొలం కూడా పారలే. రాత్రిపూట కరెంటు ఇచ్చేటోళ్లు. బోరుమోటర్లు 15 రోజులకోసారి కాలిపోతుండే. ట్రాన్స్ఫార్మర్ కోసం కరెంటోళ్ల చుట్టూ తిరిగిన బాధలు మర్చిపోలేదు. తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంటు ఉంటున్నది. 9 ఏండ్ల కింద బోరులో మోటర్ దించిన. ఇప్పటి వరకు ఒక్కసారి కాలి పోలేదు. గిప్పుడు కాంగ్రెస్‌కు ఓటేసి బాధలు పడాల్నా? కాంగ్రెస్ రాదు. ఓటేస్తే రైతులు ఎరువులకు లైన్ కట్టాలే. కరెంట్ సక్కగ రాదు.
-ఇంగోల్ సత్తయ్య,రైతు, సిద్దిపేట
తలకాయ ఉన్నోడు అట్ల మాట్లాడడు

తలకాయ ఉన్నోడైతే రైతులకు ఎవుసానికి మూడు గంటల కరెంటు సరిపోతదని మాట్లాడడు. కాంగ్రెస్ లీడర్లకు అసలు ఎవుసం గురించి తెలుసా? 3 గంటల కరెంట్ ఇస్తే రోజుకొక్క దొయ్య కూడా తడవదు. ఇగ వాళ్లు మళ్లా గెలిస్తే అదే పరిస్థితి వస్తది. రేవంత్ రెడ్డి 10 హెచ్‌పీ మోటర్ అంటున్నడు. మేం గిప్పటిదాకా పొలాలకాడ గంత మోటర్‌ను సూడలే. రైతులకు కేసీఆర్ సారు మంచిగ చేస్తుంటే వాళ్ల కండ్లు మండుతున్నయ్. నాకు ఏడెకరాల ఎకరాల పొలం ఉన్నది. ఇందులో ఒక్కటే బోరు ఉన్నది. 24 గంటల కరెంట్ ఉండబట్టి ఒక్క బోరుతో ఎడెకరాలకు నీళ్లు పారిచ్చుకుంటున్న. 10 హెచ్‌పీ మోటర్ పెడితే బోరు ఉట్టిగనే కూలిపోతది
-కాటెల సురేశ్, కల్వాడ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
మా పక్కన కన్నడ రైతులు గోసడుతున్నరు

కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలంటున్నారు. 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం వారి మూర్ఖత్వం. నాకున్న నాలుగు ఎకరాల్లో చెరుకు పండిస్తున్న. చెరుకు పంట ఎకరానికి నీళ్లు పెట్టాలంటే ఐదారు గంటలకు పైగానే పడుతున్నది. మరి 3 గంటల కరెంట్ వస్తే ఎవుసం చేయడం మాతోని కాదు. కర్మ కాలి కాంగ్రెస్ అధికారంలోని వస్తే మునపటి రోజులు వస్తయి. రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు. మా పక్కనున్న కర్ణాటకలో 10 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు 5 గంటల కరెంట్ కూడా ఇస్తలేదు. కరెంటు కోతలతో సాగు నీరు అందక అక్కడి రైతులు బాధపడుతున్నరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఇన్వర్టర్లు, జనరేటర్లే మనకు దిక్కయితయ్.
-పూర్ణచందర్, రైతు, ఖలీల్పూర్, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా
రైతులకు అంత పెద్ద మోటర్ అక్కర్లేదు

ఒకప్పుడు మోటర్ కాలితే రెండురోజుల దాక రైతులు మా దుకాణాల కాడనే ఉండేది. మస్తు ఏడుస్తుండే. సగం పైసలు మోటర్లకే పెడుతుండే. లో వోల్టేజీతోనే వైర్లు కాలిపోయేవి. ఇప్పుడు మోటర్లే వత్తలేవు. నెలకు పదిదాక మోటర్లు రిపేరుకు వత్తే ఎక్కువ. కరెంటు మంచిగ ఇచ్చుడుతోనే ఇట్ల. ఎవుసం చేసే రైతులకు 3, 5 హెచ్‌పీ మోటర్లు సరిపోతయ్. 10హెచ్‌పీ అంటే ట్రాన్స్ఫార్మర్లు మార్చాలే. అయినా, అంత పెద్ద మోటర్లు రైతులకు అక్కర లేదు. అక్కరలేని మోటర్లు పెట్టుమని సెప్పుడు మంచిదికాదు.
– ఎండీ అసిఫ్, మోటర్ మెకానిక్, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
10 హెచ్‌పీ మోటర్ అంటే పిల్లలాటలా?

రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవడమంటే పిల్లలాటలా? ఒక్కో రైతుకు లక్షకు పైగా ఖర్చు వస్తది. చిన్న, సన్నకారు రైతు 10 హెచ్‌పీ మోటర్ ఎట్లా కొనుక్కుంటడు? కొనుక్కొని ఏం చేసుకుంటడు? ఇప్పుడు రైతుల దగ్గర 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీ మోటర్లే. మోటర్లు, నీటి సౌలత్ను బట్టి రెండు నుంచి 5 గంటలకు ఎకరం పారిచ్చుకుంటడు. కాంగ్రెసోళ్లు తెలిసి మాట్లాడుతర్రో, తెల్వక మాట్లాడుతర్రో. నేను 20 ఏండ్లుగా మోటర్లు రిపేర్ చేస్తున్న. కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు మోటర్లు ఎక్కువగా కాలిపోయేవి. తెల్లందాక రిపేరు చేసేటోళ్లం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చుడు మొదలుపెట్టిండు. కరెంటు అప్ అండ్ డౌన్ అవుడు లేదు. మోటర్లు కాలిపోవుడు ఆగిపోయినయ్.
-భీమోజు శంకరాచారి, గొర్లవీడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
భూమిలో నీళ్లుంటయా?

అయ్యా! ఎన్నో పార్టీలు వచ్చినాయ్. పోయినాయ్. గిప్పుడు జర్ర మంచిగా జరుగుతుంది. కాంగ్రెసోళ్లు మళ్లీ లొల్లి పెడుతుండ్రు. గిప్పుడు ఏ రైతయినా కరెంట్ లేక చేను ఎండిపోయిందని అంటున్నాడా? జర్ర ఆలోచన చేయాలి. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్ పెడితే భూమిలో ఎన్ని నీళ్లు ఉంటయ్? నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. నాకు పక్షవాతం వచ్చింది. పింఛన్ వస్తున్నది. రైతుబంధు వస్తున్నది. అప్పుడు పంటలు పండక ఆటో నడిపిన. ఎన్నో ఇబ్బందులు పడి ముగ్గురు బిడ్డలకు, ఒక కొడుకును పెంచి, పెండ్లి చేసిన. గిప్పుడు నిమ్మలంగా ఉన్న. మంచిగ పని చేసినోళ్లను బాగా చేసిండ్రు అనకపోతే ఎలా?
– కుమ్మరి శంకరయ్య, మహబూబ్‌నగర్ జిల్లా
ఉపయోగపడే మాటలు చెప్పాలె

వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాం.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోండి అని కాంగ్రెస్ చెప్తున్న మాటలు విడ్డూరంగా ఉన్నయ్. నిన్నమొన్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కరెంటు సక్కగ ఇవ్వక రైతులు గోస పడుతున్నరు. అక్కడి కాంగ్రెస్ నేతలు 5 గంటలే ఇస్తున్నమని చెప్తున్నరు. ఇక్కడ రేవంత్ 3 గంటలే చాలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా? బోర్లలో నీళ్లు అయిపోతయ్. కరెంటు కూడా ఎక్కువ కాలుతది. నీటి వేగానికి వరి కొట్టుకుపోతది. డ్రిప్ వంటి సన్నపైపులు పగలిపోతయ్. జనానికి ఉపయోగపడే మాటలు చెప్పాలె.
-మిట్ట వెంకటరంగారెడ్డి, దామరగిద్ద, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
10హెచ్‌పీ మోటర్లతో మొదటికే మోసం వస్తది

కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ ఇస్తే పంటలు పండించేందుకు సరిపోదు. పొద్దున ఇస్తరో, రాత్రి ఇస్తరో చెప్పరు. 3 గంటలు కరెంట్ ఇస్తే ఒకేసారి రైతులు మోటర్లు స్టార్ట్ చేస్తే కాలిపోవుడు ఖాయం. కేసీఆర్ సార్ ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మోటర్లను ఆన్ చేసి నీళ్లు పారిస్తున్నాం. మూడు గంటల కరెంట్ ఇచ్చి, 10 హెచ్‌పీ మోటర్లను పెట్టుకుంటే మొదటికే మోసం వస్తది.
– నాగేంద్రం, రైతు, ఉప్పల, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా
సగం సగం కరెంట్తోటే మా ఆయన సచ్చిపోయిండు

నాకు ఊర్ల రెండెకరాల పొలం ఉన్నది. ఇప్పటి సర్కారు ఎవుసానికి 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు కాంగ్రెస్ సర్కారు ఇవ్వలేదు. పొద్దున పొతే రాత్రికే వచ్చేది. ఓ వారం రాత్రికి పోతే పొద్దున వచ్చేది. విడతల లెక్క కరెంట్ ఇచ్చేటోళ్లు. నేను, నా భర్త కాయిదాపురం లింగారెడ్డి ఇద్దరం కలిసి వ్యవసాయం చేసేవాళ్లం. రోజు మాదిరిగానే 2014 మార్చి 13న రాత్రి 7 గంటలకు కరెంట్ ఇచ్చిండ్రు. కరెంట్ వేద్దామని పోయి నా భర్త మోటరు దగ్గరనే కరెంట్ షాక్‌తో సచ్చిపోయిండు. అప్పటికి నాకు ఓ కూతరు, ఓ కుమారుడు. ఇద్దరూ చిన్న పిల్లలే. కానీ, బీఆర్ఎస్ సర్కారు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నది. ఎలాంటి ఢోకా లేకుండా నాతో పాటు రైతాంగం సంతోషంగా పంటలను సాగు చేసుకుంటున్నది. ఇప్పుడు నా బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొడుక్కి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. కేసీఆర్ దయ వల్ల తలెత్తుకొని బతుకుతున్నం.
– కాయిదాపురం గంగామణి, గున్కుల్, మహ్మద్‌నగర్ మండలం, కామారెడ్డి జిల్లా
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మళ్లీ మోసపోం

రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్‌తోనే పొలం పారుతది అని అంటుండు. అదెలా సాధ్యం? కేసీఆర్‌కు పెట్టే గుణం ఉన్నది కనుక సీఎం అయ్యాక రైతుల కోసం కష్టపడుతుండ్రు. సార్ మంచి ఆలోచన చేసిండు. కరెంట్ పోతనే లేదు. నాకు ఐదు ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలానికి 3 గంటల కరెంట్ ఎలా సరిపోతది? కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మళ్లీ మోసపోం. వాళ్లను నమ్మం.
– చంద్రనారాయణ, శ్రీపురం గ్రామం, నాగర్‌కర్నూల్ జిల్లా
రేవంత్‌రెడ్డి.. ఏం అమ్ముకొని 10 హెచ్‌పీ మోటర్లు కొనాలె?

అయ్యా రేవంత్‌రెడ్డి.. మీ అమ్మనాయిన ఎవుసం చేసిర్రా? చేస్తే 3 గంటల కరెంటు ఎందుకంటావులే? మీ వోల్లు రైతులైతే ఒక రైతుబిడ్డగా ఎకరానికి ఎన్ని గంటల కరెంటు కాలుతదని తెలిసేది. మా సన్న, చిన్నకారు రైతులం 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతోటే 40 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నం. గిప్పుడు నువ్వొచ్చి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే 3 గంటలల్ల ఎకరం పారుతదంటున్నవ్. ఏం అమ్ముకుని 10 హెచ్‌పీ మోటర్లు కొనుమంటవ్? మా రైతన్నల ఆత్మహత్యలు ఆగి పదేండ్లయింది.
మళ్లీ ఉరేసుకోవాల్నా? పురుగుల మందు తాగి సావాల్నా? కాంగ్రెసోళ్ల గవర్నమెంట్ వస్తే మళ్లా పాత బతుకులే. ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవాలంటే చెప్పులు లైన్ల పెట్టాలె. పోలీసోళ్లతోని తన్నులు తినాలె. గా గతి మాకొద్దు. కాంగిరేసు అసలే వద్దు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటుతో మా పొలాలు పుష్కలంగా పారుతున్నయి. కంటి నిండా నిద్రపోతున్నం. మా ఊర్ల ఒకాయన కాంగ్రెస్ గవర్నమెంట్ల రాత్రి కరెంటు పెడదామని పొలం కాడికి పోయి స్విచ్ వేస్తుంటే షాక్ తగిలి చర్మం కాలిపోయింది. మా పాలెంకు రా రేవంత్‌రెడ్డి. మావోణ్ణి చూపిస్త. ఈ నెల 30 తారీఖున ఓట్ల పండుగట కదా. కారు గుర్తు ఏడుందో సూస్తా. ఆ గుర్తుకే గుద్దుతా.
– నోముల పాపులు, రైతు, పాలెం గ్రామం, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా
కాంగ్రెస్ సర్కారుతో 30 ఏండ్లు గోసపడ్డం

అప్పటి లెక్క కోతల కరెంట్ ఇప్పుడు కూడా ఉంటే నా వ్యవసాయం ఎప్పుడో మూలన పడేది. నాడు పడ్డ గోస ఇప్పటికీ కండ్లముందే కనపడతాంది. కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 30 ఏండ్లు గోసపడ్డా. ఆ బాధలు తలుచుకుంటే ఇప్పటికీ దుఃఖమొస్తది. మళ్లీ కాంగ్రెస్ జమానా అంటే రైతు ఆగమైతడు. ఇప్పుడు బోరు నీళ్లను చూసినా, కాలువ నీళ్లను చూసినా, పైపులను చూసినా కేసీఆరే కనవడ్తున్నడు.
-సింగిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు, గోళ్లపాడు, ఖమ్మం రూరల్, ఖమ్మం జిల్లా