Urea | హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూరియా కొరతను అధిగమించేందుకు సర్కారు బెదిరింపుల దారిని ఎంచుకున్నది. రోజుకు ఐదు టన్నులకు మంచి యూరియాను అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శులను జైలుకు పంపుతామనే హెచ్చరికలతో కూడిన ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతున్నది. ఈ నిబంధనను పర్యవేక్షించి, పాటించని ఏఈవో, ఏడీఏలకు షోకాజు నోటీసులు ఇస్తామని, ఇంకా అవసరమైతే సస్పెన్షన్ చేస్తామని ఆ ఆడియోలో హెచ్చరించడం గమనార్హం. రైతుకు ఒక నెలలో ఒకసారి మాత్రమే అదీ నాలుగైదు బస్తాలకు మించి యూరియా అమ్మకూడదని ఆ ఆడియోలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే రైతులకు మళ్లీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు.. కుస్తీలు మొదటికొచ్చాయి! మంగళవారం పలు పీఏసీఎస్‌ల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సీ(బీ)లో ఆధార్ కార్డులను లైన్లో పెట్టి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెలలో ఒపిక నశించి ఒకరినొకరు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారిలో అన్నదాతలు ఆందోళనకు దిగారు.
ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు గత సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. సాగు రెట్టింపైనా, ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత లేకుండా చూసుకున్నారు. అసలు కొరత ఎందుకు వస్తున్నది? దీనికి పరిష్కారం ఏమిటి? వంటి అంశాలపై లోతైన పరిశీలన చేశారు. ఏప్రిల్, మేలోనే కేంద్రంతో, కంపెనీలతో చర్చలు జరిపి.. డబ్బులు చెల్లించి ఎరువులు కొనుగోలు చేశారు. ఢిల్లీలోనే అధికారులను మకాం వేయించి మన కోటా సాధించుకొని వచ్చేలా కాపుకాశారు. సీజన్‌కు ముందే ఎరువులు తెప్పించి జిల్లా కేంద్రాల్లో నిల్వ చేయించి వానలు కురియగానే రైతులకు అందించారు.
‘గుడ్ మార్నింగ్ టు ఆల్ సెక్రటరీస్.. మన సొసైటీలో ఉన్న యూరియాను ఒక్కరోజులో 5 టన్నుల కన్నా ఎక్కువ అమ్మినా, ఒక రైతుకు నాలుగు బస్తాలకు మించి ఇచ్చినా సెక్రటరీకి జైలు శిక్ష, ఏవో, ఏడీఏలు సస్పెన్షన్ అని ఏడీ చెప్పారు. కాబట్టి ఒక్కరోజులో ఐదు టన్నుల కన్నా ఎక్కువ అమ్మొద్దు. ఒక నెలలో యూరియా ఇస్తే అదే రైతుకు మళ్లీ అదే నెలలో యూరియా ఇవ్వకూడదు. ఇది మాత్రం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. ఇందులో ఏది తప్పినా మాకు షోకాజులు.. మీకు సస్పెన్షన్ ఉంటది. కాబట్టి, సీఈవోలు అందరూ ఇచ్చిన రైతుకు మళ్లీ ఇవ్వకూడదు. యూరి యా వాడకం తగ్గించాలనే ఈసారి యూరి యా పెట్టట్లేదు. మనకు లోటు మూవ్మెంట్లో వచ్చింది. ఇక రాదు. వచ్చే నెలలో వస్తది. ఒక్కరోజులో ఐదు టన్నుల కన్నా ఎక్కువ అమ్మితే మాత్రం మీ అందరికీ నోటీసులు వస్తయి. ఇది మాత్రం గుర్తించుకొని.. సెక్రటరీస్… రోజుకు 5 టన్నులు మించి అమ్మకూడదు. ఇచ్చిన రైతుకు మళ్లీ ఇవ్వకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి’ అని ఆ ఆడియోలో హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు, ఎరువుల షాపుల ముందు క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు, వాస్తవ పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. ఈ సీజన్లో అన్ని ఎరువులు కలిపి సుమారు 23 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు అన్ని ఎరువులు కలిపి 16.52 లక్షల టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయాలి. ప్రస్తుతానికి 7.8 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే సరఫరా చేసిన కంపెనీలు 8.72 లక్షల టన్నులకు కోతపెట్టాయి.
గతంలో రాష్ర్టానికి రావాల్సిన ఎరువుల కోటాపై రెండు నెలల ముందే వ్యవసాయ శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడేవారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ర్టానికి రావాల్సిన కోటా విడుదలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవారు. కానీ, ఇప్పుడు రైతుల గోస పట్టించుకునేవారే లేకుండాపోయారు. గతంలో మాదిరిగా ఎరువుల కోసం ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లడం లేదని, కిందిస్థాయి అధికారులను పంపించి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో కేంద్రంతో మంతనాలు జరపడంలో అధికారులు విఫలం కావడంతో రాష్ర్టానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల కొరత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ర్టానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం విడుదల చేయడం లేదని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా ఎరువుల కొరతలో తమ వైఫల్యం ఏమీలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
యూరియా కొరత రాకుండా నాడు కేసీఆర్ రాష్ట్రంలో బఫర్‌స్టాక్‌ను 2 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నులకు పెంచి.. ఆ మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం బఫర్‌స్టాక్‌ను మూడు లక్షల టన్నులకు తగ్గించినట్టు తెలిసింది. దీంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయనే విమర్శలున్నాయి.
అవసరమైన కోటాను కేంద్రం నుంచి విడుదల చేయించుకోవడంలోనే కాకుండా కంపెనీల వద్ద ఉన్న స్టాక్‌ను తెప్పించుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. ఇంపోర్టెడ్ యూరియాకు సం బంధించిన కంపెనీలను దారికి తెచ్చుకోవడం లో సర్కారు విఫలమైందనే విమర్శలున్నాయి.
ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల కోసం కేంద్రానికి లేఖలు రాయడం, పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.