పెద్దపల్లి, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/ఫర్టిలైజర్‌సిటీ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్టకష్టాలు పడుతూ, లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాల యూరియా అవసరాలు తీర్చే పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) షట్ డౌన్ అయినట్టు తెలుస్తున్నది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరతతో మొన్నటి వరకు 50 శాతం మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడు అమ్మోనియా పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్లాంట్ షట్ డౌన్‌తో యూరియా ఉత్పత్తికి పూర్తిగా బ్రేక్ పడింది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తికి గాను గ్యాస్ కొరతతో ప్రస్తుతం 1,850 టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు ఆర్ఎఫ్సీఎల్ నుంచి యూరియా రవాణా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా తీసుకొని తెలంగాణ రైతులకు నిరంతరం యూరియాను అందించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక పక యుద్ధం, మరో పక సాంకేతిక లోపంతో ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో ‘విదేశాల నుంచి యూరియా రావడం లేదు.. రామగుండం ఎరువుల కర్మాగారమే దికు’ అని చెప్పిన 2 రోజులకే ప్లాంట్ షట్ డౌన్ కావడంతో అంతా తలలు పట్టుకున్నారు.
ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయాలి. గ్యాస్ ఆధారితంగా నడిచే ఆర్ఎఫ్సీఎల్లో ఇటీవలి కాలంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో ఈ ఏడాదిలో 4 నెలలపాటు షట్‌డౌన్ అయ్యింది. దీంతో ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. పది రోజులుగా గ్యాస్ సరఫరా సక్రమంగా కాక సగం మాత్రమే ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. తాజాగా పూర్తిగా షట్ డౌన్ కావడం ఆందోళన కలిగిస్తున్నది. వరుస బ్రేకుల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి గాను కేవలం 7లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అయినట్టు అనధికారికంగా తెలుస్తున్నది.
ఆర్ఎఫ్సీఎల్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూరియా వాడకంలో దాదాపుగా 50 శాతం వరకు తెలంగాణకు అందే అవకాశం ఉండగా.. ఇప్పటివరకు కేవలం 55-60 శాతం వరకు మాత్రమే ఉత్పత్తిని సాధించింది. దీంతో తెలంగాణకే ఎక్కువగా లోటు ఏర్పడనున్నది. యూరియా తక్కువగా అందే అవకాశం ఉంటుంది. యాసంగికి సంబంధించి ఇంకా యూరియా అవసరాలు ఉండగా, రాబోయే వానకాలానికి సైతం ఇప్పటికే ఉత్పత్తిని చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సీజన్‌కే సరిపడా నిల్వలు లేకపోవడంతో వచ్చే వానకాలంలో పరిస్థితి ఏంటనే? ఆందోళన కలుగుతున్నది. తెలంగాణతోపాటుగా మరో ఆరు రాష్ర్టాలకు ఆర్ఎఫ్సీఎల్ యూరియా సరఫరా చేస్తుండగా.. తక్షణమే ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సగమే జరగడంతో ఇక్కడ ఉత్పత్తి సైతం సగం వరకే జరిగింది.