Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రైతుబంధు బిచ్చమట..! ఈ దురహంకార వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన ఉద్దేశంలో రైతుబంధు బిచ్చమైతే.. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తున్నది. మంగళవారం కొల్లాపూర్ బహిరంగసభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘రైతుబంధు కింద రైతులకు సీఎం కేసీఆర్ రూ. 10 వేలు బిచ్చమేస్తే.. మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం’ అంటూ రైతులను అవమానించేలా మాట్లాడారు. రైతుబంధును ఆయన బిచ్చంతో పోల్చితే.. రైతులను బిచ్చగాళ్లుగా భావించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రైతుబంధు బిచ్చమైనప్పుడు.. మీరెందుకు ఆ పథకాన్ని కాపీ కొట్టి రైతుభరోసా పేరుతో గ్యారెంటీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రైతులపై, వ్యవసాయంపై విషం కక్కడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొన్న ఇదే రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని అన్నారు.
రైతుబంధును ఆపేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాసింది. రైతుబంధు దుబారా ఖర్చు అని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. రైతుబంధును పుట్టించిందే సీఎం కేసీఆర్. రైతులకు ఏదో విధంగా పెట్టుబడి గోస తీర్చాలనే ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఇది.
అంతకు ముందు ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు. ఇప్పటి వరకు రైతుబంధు కింద ప్రభుత్వం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున ఇస్తున్నది. దీన్ని వచ్చే ఎన్నికల తర్వాత ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పథకాన్ని కాపీ కొట్టిన కాంగ్రెస్.. రైతుబంధు పేరు మార్చి రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అంటే బీఆర్ఎస్కన్నా రూ. వెయ్యి తక్కువగానే ఇస్తామని చెప్పారు.
ఇలాంటిది ఆ పార్టీకి అధ్యక్షుడు రైతుబంధును, ఆ పథకాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ను విమర్శించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకు ఈ బిచ్చమెందుకు వెయ్యలేదో చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమను కష్టాల నుంచి గట్టెక్కిచ్చిన రైతుబంధు పథకంపై పిచ్చి కూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రైతుబంధుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేస్తామని స్పష్టంచేస్తున్నారు.