రైతు డిస్కమ్‌కు రెడ్‌సిగ్నల్!
ఏడాది కాలంగా హడావుడి. కోట్లాది రూపాయల ఖర్చు. ఆఫీసులు.. అనుమతులు.. ఘనమైన ప్రకటనలు! కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఇదీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ వ్యవహారం.
- ఇంకా ప్రారంభంకాని కార్యకలాపాలు
- షరతులతో కూడిన లైసెన్స్ ఇచ్చిన ఈఆర్సీ
- 4 నెలల గడువునిచ్చిన కమిషన్
- 10వ తేదీతో ముగిసిన డెడ్‌లైన్
- కమిషన్ షరతులు ఇంకా పెండింగ్
- మూడో డిస్కమ్‌పై నీలినీడలు
- ఆరంభానికి ముందే అగ్నిపరీక్ష
- ఏడాదిగా చేసిన ఖర్చులపై ప్రశ్నలు
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏడాది కాలంగా హడావుడి. కోట్లాది రూపాయల ఖర్చు. ఆఫీసులు.. అనుమతులు.. ఘనమైన ప్రకటనలు! కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఇదీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ వ్యవహారం. రైతాంగం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ అరంభానికి ముందే అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నది. కొత్త డిస్కమ్ డోలాయమానంలో పడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఏడాది నుంచి కొత్త డిస్కమ్ పేరు జపిస్తున్న సర్కార్ తీరా అసలు విషయానికి వచ్చే సరికి కాడెత్తేసింది.
కొత్త డిస్కమ్ కార్యకలాపాలు ఇంకా ప్రారంభంకాలేదు. మరీ అత్యంత ముఖ్యమైన విషయం ఏందంటే రైతు డిస్కమ్‌కు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) షరతులతో కూడిన లైసెన్స్‌ను జారీచేసింది. ఈఆర్సీ విధించిన షరతుల్లో అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాలేదు. కొత్త నియామకాల ఊసేలేదు. గ్రిడ్ అనుసంధానం జాడేలేదు. మొత్తంగా సంస్థ ఏర్పాటు ప్రకటనలు, కాగితాలకే పరిమితమైంది. ఈ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీని ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు బదిలీ చేసింది. రైతు డిస్కమ్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలప్పగించింది. ఈ నేపథ్యంలో రైతు డిస్కమ్ ప్రయోగం విఫలమైనట్టేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నాలుగు నెలల డెడ్‌లైన్ పూర్తి
రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2025 మార్చి 11న జీవో-4 జారీచేసింది. ఆ తర్వాత 2026 జూలై 10న ఈఆర్సీ రైతు డిస్కమ్‌కు పంపిణీ లైసెన్స్ మంజూరు చేసింది. ఇది పూర్తిగా షరతులతో కూడిన లైసెన్స్. జూలై 10న ఈఆర్సీ లైసెన్స్ మంజూరుచేసిన ఈఆర్సీ కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నెలల గడువు పెట్టింది.
ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి నాలుగు నెలల్లోపు రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టంచేసింది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు అన్ని ముందస్తు షరతులు, ఆదేశాలను పూర్తిచేయాలని.. ఒకవేళ షరతులు నెరవేరకపోతే రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభించరాదని ఆదేశించింది. ఇదే విషయాన్ని కమిషన్‌కు నివేదించాలని ఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది. మొత్తంగా కమిషన్ విధించిన గడువు ఈ నెల 10వ తేదీతో పూర్తయ్యింది. ఇంతవరకూ అన్ని షరతులు అమలుకాకపోవడంతో రైతు డిస్కమ్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఏడాది ఖర్చంతా వృథాయేనా?
రైతు డిస్కమ్ ఏర్పాటుపై ప్రభుత్వం ఏడాది కాలంగా పెద్దఎత్తున కసరత్తు చేసింది. తొలుత క్యాబినెట్ ఆమోదించగా.. ఆ తర్వాత కేంద్ర కార్పొరేట్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందింది. ఆ తర్వాత అనుమతులు, ఏర్పాట్ల్ల పేరిట ఈ ఏడాది కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసింది. మింట్ కాంపౌండ్‌లో రైతు డిస్కమ్‌కు కార్యాలయాన్ని కూడా కేటాయించారు.
ఈఆర్సీ షరతులతో కూడిన లైసెన్స్ జారీచేసిన తర్వాత రైతు డిస్కమ్ స్పీడ్ తగ్గింది. లైసెన్స్ షరతుల్లో ఆశించిన వేగం కనిపించలేదు. కమిషన్ షరతులను డిస్కమ్ పట్టించుకోలేదు. కమిషన్ ఇచ్చిన నాలుగు మాసాల గడువు సమీపిస్తున్న తరుణంలో అక్టోబర్ 12న ప్రభుత్వం ఆస్తులు, అప్పులను విభజించింది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను కేటాయించింది. మిగతా షరతులు పూర్తిచేయడంలో దాదాపు విఫలమైంది.
ముందుకా? వెనక్కా?
రాష్ట్రంలోని రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. వ్యవసాయ కనెక్షన్లతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి ఇతర తాగునీటి కనెక్షన్ల బాధ్యతలను కూడా ఈ సంస్థ పరిధిలోకి చేర్చింది. రాష్ట్రంలోని 30.62 లక్షల కనెక్షన్లను కొత్త డిస్కమ్‌కు కేటాయించింది.
దాదాపు రెండువేల మంది సిబ్బంది అవసరమని స్పష్టంచేసింది. ఇంతటి విస్తృత బాధ్యతలున్న సంస్థను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఈఆర్సీ విధించిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రైతు డిస్కమ్‌పై ముందుకా.. వెనక్కా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గడువు ముగియడంతో మళ్లీ ఈఆర్సీ తలుపుతట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఆర్సీలో అనుబంధ పిటిషన్‌ను సమర్పించాల్సి ఉన్నది. ఈ దిశగా రైతు డిస్కమ్ చొరవ చూపడంలేదు.
ఈఆర్సీ షరతులు – అమలు తీరు
- విద్యుత్తు చట్టం-2003 సెక్షన్-131 (4), (5) ప్రకారం ప్రభుత్వం అధికారికంగా ట్రాన్స్ఫర్ స్కీమ్‌ను ప్రకటించా లి. ఆస్తులు, అప్పులు, వినియోగదారు ల కనెక్షన్లు, హక్కులు, ఉద్యోగుల బాధ్యతలను స్పష్టంగా పేర్కొనాలి. కేవలం విభజన కాగితాలకే పరిమితమైంది. కనెక్షన్లు, వినియోగదారులు ఇంకా పాత డిస్కమ్ పరిధిలోనే ఉన్నారు.
- డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ రెగ్యులేషన్స్-2016 క్లాజ్ 38.1 ప్రకారం ఉత్తర్వులు వెలువడిన మూడు నెలల్లోపు రైతు డిస్కమ్ తన సమగ్ర వ్యాపార ప్రణాళికను కమిషన్‌కు సమర్పించి ఆమోదం పొందాలి. సంవత్సరాల వారీ లోడ్, వృద్ధి అంచనాలు, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంటర్ఫేస్ మీటరింగ్ ప్లాన్, పీపీఏ కేటాయింపు, మూలధన సమృద్ధి ప్రణాళిక, ఉద్యోగుల సర్దుబాటు వివరాలు స్పష్టం చేయాలి. వ్యాపార ప్రణాళికను ఈఆర్సీకి రైతు డిస్కమ్ సమర్పించలేదు.
- రైతు డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ నిబంధనల ప్రకారం షెడ్యూల్-2 కింద దరఖాస్తు సమర్పించాలి.
- రైతు డిస్కమ్ పాత డిస్కమ్‌లు (ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు) కలిపి 60 రోజుల్లోపు ఇంటర్ డిస్కమ్ ట్రాన్స్మిషన్ ఒప్పందాలు, సర్వీస్ లెవల్ అగ్రిమెంట్లపై సంతకాలు చేయాలి. దీంట్లో ఓఅండ్ఎం, కొత్త కనెక్షన్ల జారీ, మౌలిక వసతుల భాగస్వామ్యం, ఉద్యోగుల డిప్యుటేషన్, ఎనర్జీ అకౌంటింగ్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం) వంటి అంశాలుండాలి. దీనిపై పురోగతి లేదు.
- విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల తుది కేటాయింపు జరిగే వరకూ మధ్యంతర విద్యుత్తు సరఫరా కోసం రైతు డిస్కమ్, ఇతర డిస్కమ్‌లు బల్క్ సప్లయ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. ఇది జరిగినట్లు రుజువుల్లేవు.
- తుది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కేటాయింపు ఉత్తర్వులు వెలువడే ముందు మూడు డిస్కమ్‌లు కలిసి కేటాయింపు విధానంపై కనీసం మూడు నెలలపాటు మాక్ రన్ నిర్వహించి సమస్యలను పరిష్కరించుకుని నివేదిక ఈఆర్సీకి సమర్పించాలి. మాక్న్ నిర్వహించలేదు.
- ట్రాన్స్‌కో ఇతర డిస్కమ్‌లతో గ్రిడ్ కనెక్టివిటీ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) వద్ద రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకొని ఎంటీటీ కోడ్లను పొందాలి. ఇంతవరకూ ఎంటీటీ కోడ్‌ను పొందలేదు.
- ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు.. సీనియారిటీ, పెన్షన్ బాధ్యతలు, రిజర్వేషన్ రోస్టర్, ప్రమోషన్లకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలి. దీనిపై సందిగ్ధతే కొనసాగుతున్నది.
- రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఉత్తర డిస్కమ్‌లో ఒకటి, దక్షిణ డిస్కమ్‌లో మరొకటి చొప్పున రెండు ఏర్పాటు చేయాలి. అప్పటివరకూ పాత డిస్కమ్‌ల పరిష్కార వేదికలే ఫిర్యాదులను పరిష్కరించాలి. ఇంతవరకూ కొత్త పరిష్కార వేదికలను ఏర్పాటు చేయలేదు.
- సీఈఏ మీటర్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్ నిబంధనల ప్రకారం రైతు డిస్కమ్ నెట్వర్క్, పాత డిస్కమ్‌ల నెట్వర్క్ మధ్య ఉన్న ఇంటర్ఫేస్ పాయింట్ల వద్ద తగిన కచ్చితత్వంతో కూడిన మీటర్లను దశల వారీగా ఏర్పాటు చేయాలి. కానీ, మీటర్లు ఏర్పాటు చేయలేదు.
- రైతు డిస్కమ్ అధికారికంగా ప్రారంభమయ్యే వరకూ వ్యవసాయ కనెక్షన్లతో సహా ఇతర వర్గాల కొత్త కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు. అప్పటివరకూ పాత డిస్కమ్‌లే యథావిధిగా కొత్త కనెక్షన్లు మంజూరుచేయాలి. కాగా, రైతు డిస్కమ్ పేరిట కనెక్షన్ల జారీ ఇంకా ప్రారంభంకాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

