నత్తనడకన అల్వాల్ టిమ్స్ పనులు
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిన ప్రతిష్ఠాత్మక అల్వాల్ టిమ్స్(తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణం ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నది.
- ఆర్అండ్బీ శాఖలో అంతులేని అలసత్వం
- కేసీఆర్ హయాంలో వేగంగా నిర్మాణ పనులు
- కాంగ్రెస్ పాలనలో మందగించిన పనులు
- త్వరలో ప్రారంభం అంటూ మంత్రుల హడావుడి
- డేట్లు డెడ్లైన్లకే పరిమితమైన మంత్రుల ప్రకటనలు
- ఆదరాబాదరగా ప్రారంభించిన సనత్‌నగర్ టిమ్స్
- ఓపీ సేవలతో బస్తీ దవాఖానను తలపిస్తున్న వైనం
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిన ప్రతిష్ఠాత్మక అల్వాల్ టిమ్స్(తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణం ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నది. నాడు కేసీఆర్ చొరవతో అవసరమైన భూసేకరణ, పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపులను స్వల్ప వ్యవధిలో పూర్తయి శరవేగంగా పనులు పరుగులు పెట్టగా, ఇప్పుడు రేవంత్ హయాంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటివరకు కేవలం 70శాతం పనులే పూర్తయ్యాయి. ఆర్ అండ్ బీ విభాగం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల సివిల్ పనులు నెమ్మదించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు మాత్రం ప్రారంభోత్సవ విషయంలో భిన్నమైన ప్రకటనలు చేస్తూ, డెడ్లైన్లు మార్చడమే తప్ప ఆచరణలో ఏ పురోగతీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తికాకముందే ఆదరాబాదరగా ప్రారంభించడంతో కేవలం ఓపీ(ఔట్ పేషెంట్)కే పరిమితం కాగా బస్తీ దవాఖానను తలపిస్తున్నది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఇంతటి ముఖ్యమైన దవాఖాన విషయంలో ప్రభుత్వం రాజకీయాలు పకనబెట్టి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ వ్యక్తమవుతున్నది.
నాడు కేసీఆర్ చొరవతో శరవేగంగా పనులు
హైదరాబాద్ నగరానికి నలువైపులా గాంధీ, ఉస్మానియా తరహాలో 1,000 పడకలతో కూడిన టిమ్స్ దవాఖానల నిర్మాణానికి గత బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేసీఆర్ హయాంలో ఏప్రిల్ 2022లో రూ.1,100 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా అల్వాల్‌లో టిమ్స్ పనులు మొదలుపెట్టగా, ప్రారంభంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా, ఆ తర్వాత అందులోనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని నాడు కేసీఆర్ ప్రకటించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల భారీ భవన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పరుగులు పెట్టించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పురోగతి పూర్తిగా నెమ్మదించింది.
కాంగ్రెస్ పాలనలో నత్తనడకన పనులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం మొదలైంది. గత ప్రభుత్వం తలపెట్టిన పనులను పూర్తిచేయడంలో ప్రస్తుత ప్రభుత్వం మీనమేషాలు లెకిస్తుండటంతో పూర్తిగా మందగించింది. ఆర్ అండ్ బీ శాఖకు తగినంత బడ్జెట్ విడుదల చేయకపోవడం, కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఫలితంగా స్థానిక పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. కేసీఆర్‌కు మంచి పేరొస్తుందనే అకసుతోనే ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రారంభోత్సవంపై మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలు
అల్వాల్ టిమ్స్ ప్రారంభోత్సవం విషయంలో మంత్రుల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండటం ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నది. నిరుడు జనవరిలో దవాఖానను సందర్శించిన ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 90శాతం పనులు పూర్తయ్యాయని ఆగస్టు నాటికి ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ, ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం పనులు 95శాతం పూర్తయ్యాయని, జనవరిలో ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. అయితే దాదాపు రెండేండ్ల వ్యవధిలో కేవలం 5శాతం పనులే జరిగాయా అంటూ ప్రజాప్రతినిధులు, విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వాస్తవానికి మంత్రి దామోదర చెప్పినట్టు పనులు 95శాతం పూర్తి కాలేదని, జనవరిలో ప్రారంభోత్సవం ఉండదని బుధవారం టిమ్స్‌ను సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ నేత క్రిశాంక్ స్పష్టంచేశారు.
బస్తీ దవాఖానలా సనత్‌నగర్ టిమ్స్
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సనత్‌నగర్ టిమ్స్‌ను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నామమాత్ర హంగులతో జరిగిన ఈ ప్రారంభోత్సవం తర్వాత కూడా ఈ దవాఖాన ఒక సాధారణ బస్తీ దవాఖానలా మాత్రమే నడుస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రాలేదు, అత్యవసర, డయాగ్నొస్టిక్ సేవలు ప్రారంభం కాలేదు. పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు అందకపోవడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తున్నది. సిబ్బంది నియామకం సైతం తీవ్ర విమర్శలకు దారితీసింది. కొత్తగా స్పెషలిస్టులు, నర్సులను నియమించకుండా ఇప్పటికే రోగుల ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తరలించారు. దీనివల్ల సనత్‌నగర్‌లో సరైన వైద్యం అందకపోగా, అటు ఉస్మానియా, గాంధీల్లో కూడా సాధారణ రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ డొల్లతనం బయట పడుతుందనే తనిఖీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

