ఇజ్రాయెల్‌లో కొత్తగాలి
ఇజ్రాయెల్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా యాషర్ పార్టీ అధినేత గాదీ ఐజెన్కోట్ను అధ్యక్షుడు ఇసాక్ హెర్గోగ్ ఆహ్వానించడంతో హంగ్ ఎన్నికల ఫలితాలతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి దాదాపుగా తెరపడినట్టే.
ఇజ్రాయెల్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా యాషర్ పార్టీ అధినేత గాదీ ఐజెన్కోట్ను అధ్యక్షుడు ఇసాక్ హెర్గోగ్ ఆహ్వానించడంతో హంగ్ ఎన్నికల ఫలితాలతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి దాదాపుగా తెరపడినట్టే. 120 స్థానాలుండే ఇజ్రాయెల్ పార్లమెంటు సెనెట్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాలనను తిరస్కరించినప్పటికీ, ఇతర పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. మెజారిటీ స్థానాలను నెతన్యాహు వ్యతిరేక పార్టీలు గెలువడం విశేషం. యుద్ధాలు, దాడులతో విసిగిపోయిన ప్రజలు మార్పును కోరుకున్నారన్నది వాస్తవం. సుదీర్ఘకాలం కొనసాగుతున్న లికుడ్ పార్టీ మతోన్మాద, వివక్షాయుత విధానాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఆ పార్టీ కూటమి మెజారిటీకి అవసరమైన 61 స్థానాలను సాధించలేకపోయింది. కాగా 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన యాషర్ పార్టీ కూటమి 48 సీట్లు సాధించింది. అసాధారణ రీతిలో మైనారిటీ అరబ్ పార్టీలు రికార్డు స్థాయిలో 19 స్థానాలు గెలుపొందడం విశేషం. అవి స్వయంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేనప్పటికీ ఎవరు అధికారం చేపట్టాలో నిర్ణయించే కీలకం వాటి చేతుల్లోనే ఉన్నది.
అరబ్ పార్టీలు నెతన్యాహుకు మద్దతు ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమే. దీంతో సహజంగానే ఐజెన్కోట్ వైపు అధ్యక్షుడు మొగ్గినట్టు స్పష్టమైపోతున్నది. ఈ నెల 10న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఐజెన్‌కోట్‌కు డిసెంబర్ 6 వరకు గడువు ఉన్నది. అవసరమైతే డిసెంబర్ 20 వరకు పొడిగింపు పొందే అవకాశం ఉన్నది. ఆయన విఫలమైతే నెతన్యాహుకు మరోసారి అవకాశం లభించవచ్చు. ఇద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ అలా జరిగేందుకు అవకాశాలు తక్కువే. అరబ్ పార్టీలు మద్దతు తెలిపితే యాషర్ కూటమి బలం 69కి చేరుతుంది. దాంతో విశ్వాస పరీక్షలో ఐజెన్కోట్ సులభంగానే నెగ్గుతారని అంటున్నారు.
ఇజ్రాయెల్ ప్రజల తీర్పులో మనకు రెండు అంశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఒకటి; దుందుడుకు, దుస్సాహసిక విధానాలతో దేశాన్ని యుద్ధోన్మాదం వైపు నడిపించిన నెతన్యాహు పాలనను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని భావించవచ్చు. పూర్తిగా సైనికబలంతోనే ఇజ్రాయెల్ అస్తిత్వానికి రక్షణ కల్పించుకోవచ్చనే విధానం అర్థరహితమైందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రెండు; అనూహ్యమైన రీతిలో ఇజ్రాయెలీ అరబ్‌లు ఒకతాటి మీదికి వచ్చి పార్లమెంటులో బలం పెంచుకోవడం కీలక పరిణామం. అరబ్ పార్టీల గెలుపును అడ్డుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని నెతన్యాహు ఉసిగొల్పినా ఆ ప్రయత్నాలేవీ పనిచేయలేదు. అరబ్బు పార్టీలతో దేశానికి ప్రమాదమని నెతన్యాహు పదేపదే చెప్తున్నారు. కానీ అవే పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఐజెన్కోట్ చెప్తున్నారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటూనే నెతన్యాహు ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్వడం గర్హనీయం.
అందుకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మాజీ సైన్యాధిపతి అయిన ఐజెన్కోట్ రక్షణ దళాలను హెచ్చరించడం గమనార్హం. ఇల్లలుకగానే పండుగ కాదన్నట్టు సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుతోనే ఇజ్రాయెల్ సమస్యలు సమసిపోవు. గాజాలో శాంతిని నెలకొల్పి, యుద్ధబాధితులకు సాయం అందజేయడం, నెతన్యాహు వివాదాస్పాద విధానాలను తిరగరాయడం ఐజెన్కోట్ ముందున్న తక్షణ కర్తవ్యాలు. సుప్రీంకోర్టు అధికారాలకు కత్తెర వేస్తూ తెచ్చిన నిబంధనలను తొలగించాల్సిన అవసరమూ ఉన్నది. ఇజ్రాయెల్‌లో అంతర్గతంగా, విస్తృతస్థాయిలో పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే యూదు, అరబ్ వర్గాలు కలిసి పనిచేయక తప్పదు. ఆ దిశగా ఐక్యత సాధించి ఇజ్రాయెల్‌ను ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత ఐజెన్కోట్ భుజస్కంధాలపై ఉన్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

