హైడ్రా రంగనాథ్‌ను హైకోర్టుకు పట్టుకురండి
కోర్టులంటే లెక్కలేదు. న్యాయస్థానాలను ధిక్కరించడమే తన నైజంగా ఫీలవుతారు. కోర్టు చీవాట్లు పెట్టిన తరువాత కూడా తప్పు జరిగిందని ఒప్పుకోరు. చివరికి కోర్టు నిప్పులు చెరుగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నట్టు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు.
- డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఆదేశం
- బిజీగా ఉన్నామని కోర్టు ధిక్కరణ కేసుల్లో తప్పించుకోలేరు
- రంగనాథ్ 17న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందే
- శంషాబాద్ ప్రైవేట్ ల్యాండ్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఆదేశం
- సమన్లు జారీ చేసినా పట్టించుకోరా? అంటూ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/స్పెషల్ టాస్క్ బ్యూరో/సిటీబ్యూరో : కోర్టులంటే లెక్కలేదు. న్యాయస్థానాలను ధిక్కరించడమే తన నైజంగా ఫీలవుతారు. కోర్టు చీవాట్లు పెట్టిన తరువాత కూడా తప్పు జరిగిందని ఒప్పుకోరు. చివరికి కోర్టు నిప్పులు చెరుగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నట్టు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. న్యాయమూర్తి కోర్టుకు పిలిచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిస్తే క్షమాపణ చెప్తారు. 24 గంటలు గడిచాక మళ్లీ షరామామూలే. మళ్లీ కోర్టు మండిపడితే.. అదే పాత పాట.. అదే క్షమాపణ! ఈ ఉపోద్ఘాతం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురించే. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి రంగనాథ్‌ను ఈ నెల 17న న్యాయస్థానంలో హాజరుపర్చాలంటూ డీజీపీ సీవీ ఆనంద్‌ను రాష్ట్ర హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాకపోవడం ఏమిటని న్యాయస్థానం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రంగనాథ్ పిటిషన్‌నూ న్యాయస్థానం కొట్టివేసింది.
వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 626/2ఏలోని ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కొనసాగుతున్నది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉన్నది. అయితే, విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని రంగనాథ్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తప్పుబట్టారు. భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ పిటిషనర్ వేసిన దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, కమిషనర్ మినహాయింపు ఎలా కోరుతారని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఎల్ నినో ప్రభావంతో విచ్చలవిడిగా బోర్లు వేస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన విధుల్లో బిజీగా ఉన్నందున రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకాలేకపోయారని కమిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్ శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ.. తహసీల్దార్ అమర్లింగం రాసిన లేఖ ఆధారంగా హైడ్రా కమిషనర్ భూమిని స్వాధీనం చేసుకున్నారని, పిటిషనర్‌కు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమన్లు జారీచేసినప్పటికీ రంగనాథ్ విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ దాఖలు చేసిన హాజరు మినహాయింపు అభ్యర్థనను ఈ సందర్భంగా తిరస్కరించారు. ఈ నెల 17న రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను, అదే రోజున శంషాబాద్ తహసీల్దార్ కూడా హాజరయ్యేలా చూడాలని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
విధుల పేరు చెప్పి తప్పించుకోలేరు
కోర్టు ధిక్కరణ కేసుల్లో అధికారిక విధుల్లో బిజీగా ఉన్నామన్న కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన వ్యక్తిగత బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది. బాచుపల్లి భూములకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై కోడూరు అర్జునరావు 2025లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై కూడా న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలంగాణ భూసంస్కరణల చట్టం కింద పిటిషనర్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరికి గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన హాజరుకాలేదు. జిల్లా కలెక్టర్‌గా, ఎన్నికల అధికారిగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో తీరిక లేకుండా ఉన్నందున హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.
దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు వాదిస్తూ, 2025 జూలైలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకుండా కలెక్టర్ సాకులు చెప్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అధికారిక విధుల్లో బిజీగా ఉన్నామన్న కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందలేరని స్పష్టం చేశారు. గతంలో ఫిబ్రవరి 27, ఏప్రిల్ 2 తేదీల్లో కలెక్టర్‌కు హాజరు మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 11న వ్యక్తిగతంగా హాజరై పిటిషనర్ భూమిని ఏ చట్ట నిబంధన ప్రకారం స్వాధీనం చేసుకున్నారో, అందుకు అనుసరించిన ప్రక్రియ ఏమిటో, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణం ఎంత? తదితర వివరాలు వెల్లడించాలని గతంలోనే ఆదేశించినప్పటికీ మరోసారి మినహాయింపు కోరడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ అభ్యర్థనను తిరస్కరించి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఆ రోజు కలెక్టర్ మను చౌదరి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు.
అసలేందీ శంషాబాద్ కేసు?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలో 9.05 ఎకరాల వివాదాస్పద భూమిలో ఉన్న నిర్మాణాలను గత ఏప్రిల్‌లో హైడ్రా కూల్చేసింది. సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండగా అందులో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇంకా 9.05 ఎకరాల భూమిపై యాజమాన్యం, ప్రభుత్వ హక్కుల విషయంలో హైకోర్టులో వివాదం కొనసాగుతున్నది. తజమ్ ముల్ మొయినుద్దీన్‌ఖాన్ అనే వ్యక్తి హైడ్రా కమిషనర్, తహసీల్దార్‌పై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి మొత్తం 176.05 ఎకరాల భూమి ఖాస్రా పహాణీలో ప్రభుత్వ భూమిగా నమోదైందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 9.05 ఎకరాలు ఎస్ఎస్ 14 నిజాంకు చెందిన భూములుగా ఇందులో కొంతమంది హక్కులు క్లెయిమ్ చేస్తున్నారు.
ఈ వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. తుది తీర్పు వచ్చే సమయానికి ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదంటూ స్టేటస్కో ఉన్నది. 1982 హైకోర్టులోనే తమ కుటుంబానికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చామని, 1991లో తుది డిక్రీ జారీ అయిందని తజమ్ముల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2024 డిసెంబర్లో తహసీల్దార్ తమ పేరుతో ఎండార్స్మెంట్ ఇచ్చారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని ప్రభుత్వ భూమిగా మళ్లీ మళ్లీ ఎండార్స్’కు రాసిన లేఖ రాసిన అధికారులు హైడ్రాకూ ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదుతో హైడ్రా ఆపరేషన్ చేపట్టి ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించి అక్కడ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది.
- ఎన్ అధికారం చెలాయిద్దామని చూస్తున్నారా.. సరే, అయితే మేమేంటో రుచి చూపిస్తాం!
- వీకెండ్లో ఈ ఆగమాగం కూల్చుడేంది? తహసీల్దార్ చెప్తే హైకోర్టునూ కూల్చేస్తారా??
- సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా? మీ వల్ల అధికారులు కోర్టులకు వస్తున్నారు.
- ఒక్క అధికారిపై ఏడాదిన్నర కాలంలో ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులా? ఏంది ఇదంతా?
- క్షమాపణలు చెప్పినంత మాత్రాన మిమ్మల్ని వదిలేయాలా?
- మీకు కోర్టులంటే ఏమాత్రం గౌరవం లేదు.
- వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తాం!
- ఇన్నిసార్లు చెప్పినా మీ తీరు మారదా? మీ అహంకారధోరణి ఏంది?
- హైడ్రాపై మిలిటరీ యాక్షన్‌కు దిగుతాం. జాగ్రత్త!!
- ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం.
- ఇక, మరోమార్గం లేదు. హైడ్రా కమిషనర్‌గా ఆయన్ని తక్షణమే తొలగించండి.
ఇవేవో రాజకీయ నాయకులు అన్న మాటలు కాదు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఉద్దేశించి హైకోర్టు పలు సందర్భాల్లో ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ, ఆయన తీరు మారలేదు. దీంతో రంగనాథ్‌ను కోర్టు ముందు హాజరుపర్చాలంటూ తాజాగా మరోసారి పోలీసులను ఆదేశించింది.
గతంలోనూ చీవాట్లెన్నో..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది తొలిసారేమీ కాదు. ఆయన్ని ఆ పోస్టు నుంచి తొలగించాలని, ఇలాగే ప్రవర్తిస్తే ఆర్మీ యాక్షన్ అని ఉన్నత ధర్మాసనం రంగనాథ్‌ను గతంలో తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
కోర్టునూ కూల్చేస్తారా?
హైడ్రాకు విధానమంటూ ఏముంది? వీకెండ్లో ఆగమాగం కూల్చుడెందుకు?? తహసీల్దార్ చెప్తే హైకోర్టునూ కూల్చేస్తారా?
– 30.09.2024
హైడ్రాను మూసేస్తాం
స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది? ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? ఇలాగైతే, హైడ్రాను మూసేస్తాం.
– 20.02.2025
కోర్టు అధికారాలేంటో రుచి చూస్తారు
చట్టప్రకారమే పనులు చేపట్టండి. హైడ్రాకు అధికారం ఉంటే.. అంతకంటే ఉన్నతమైన హైకోర్టుకు ఉన్నది. మీరు అధికారం చెలాయిస్తే, కోర్టు అధికారం ఏంటో రుచి చూపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి.
-14.11.2025
వారెంట్ జారీ చేస్తాం
కోర్టులంటే రంగనాథ్‌కు గౌరవం లేనట్టు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తాం.
-27.11.2025
ఇంత అహంకారమా?
అంశానికి సంబంధించి ఒకటి కాదు ఒకే రెండు కాదు.. కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎన్నెన్నో దాఖలు అవుతూనే ఉన్నాయి. మీ వైఖరి చూస్తే, న్యాయస్థానం అంటే ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. ఇంత అహంకారపూరిత ధోరణి పనికిరాదు. పిటిషనర్లు కాకుండా ఇప్పుడు కోర్టే బాధితుడిగా మారింది. ఇలాంటి ప్రవర్తనను సహించబోం.
– 20.07.2026
హైడ్రాపై మిలిటరీ యాక్షన్ తప్పదు
ఎన్నిసార్లు కోర్టు ధిక్కరణకు చేస్తారు. మళ్లీ ఓసారి ఇలా పిలిచే, ఆర్మీని హైడ్రా అధికారులను బ్యారక్‌లో ఉంచాలని ఆదేశిస్తాం.
– 23.07.2026
రంగనాథ్ క్షమాపణ చెప్పాల్సిందే
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరు మారట్లేదు. ఆయనలో అహంకార ధోరణి కనిపిస్తోంది. కోర్టు ధిక్కరణ చర్యలపై క్షమాపణలు చెప్పాల్సిందే. అఫిడవిట్ చూశాక ఆర్మీని దింపే పరిశీలించాం.
– 24.07.2026
రంగనాథ్‌ను తొలగించండి
ఒక్క అధికారిపై ఏడాదిన్నర కాలంలో 63 కోర్టు ధిక్కరణ కేసులా? ఉల్లంఘనల తీవ్రతకు ఇవే సాక్ష్యం. క్షమాపణ చెప్పినంత మాత్రాన వదిలేయాలా? కోర్టులను ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలి. హైడ్రా కమిషనర్‌ను తక్షణమే తొలగించండి.
-27.07.2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

