నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ.. నేడు స్వపరిపాలనలో డీలా పడింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆగిన సంక్షేమంతో ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి. చేతిలో పైసల్లేక తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి.. మార్కెట్లో క్షీణించిన డిమాండ్‌కు అద్దం పడుతున్నది. అమ్మకాల్లేక ధరలు పతనమైతే.. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ సర్కారు డబ్బా కొట్టుకొనే దుస్థితి ఏర్పడింది. ఇకనైనా అప్రమత్తం కాకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభమేనంటూ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
– అంకం సంతోష్
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 19: దేశంలోనే ధనిక రాష్ట్రంగా విరాజిల్లిన తెలంగాణ వైభవం ఇప్పుడు మసకబారిపోయింది. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రంలో ఎప్పటికీ, ఎవ్వరూ ఊహించని మార్పునే తీసుకొచ్చింది. అవును.. పైసల్లేక, కొనుగోలు శక్తి అడుగంటి రాష్ట్ర ప్రజానీకం అల్లాడిపోతున్నది మరి! మార్కెట్లో డిమాండ్ పడిపోయి ధరలు తగ్గుతుంటే, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశామంటూ సర్కారీ పెద్దలు గొప్పలు చెప్పుకొనే దుస్థితి దాపురించింది.. ధరల తగ్గుదలకు, డిమాండ్ క్షీణతకు మధ్య తేడా తెలియని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? అన్న సందేహాలూ తలెత్తకపోవు! అసలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? ఎందుకింతలా అస్తవ్యస్తంగా తయారైంది?
రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. తెలియట్లేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. వాపును చూసి బలుపు అని జబ్బలు చరుచుకునేవారు గద్దెనెక్కితే పరిస్థితి ఇలాకాకుంటే ఎలా? ఉంటుందన్నది వారి ఉద్దేశం మరి. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం గత ఏడాదిన్నర కాలంగా బాగా తగ్గిపోయిందన్నది మెజారిటీ విశ్లేషకుల మాట. అంతకుముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేయడంతో అందరి దగ్గర పైసలుండేవని, దీంతో అవసరాలు తీర్చుకునేవారని అంటున్నారు.
ప్రధానంగా రైతుబంధు వంటి పథకాలు.. తెలంగాణ గ్రామీణుల జీవన ప్రమాణాలను ఎంతో పెంచాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం. కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కారు రైతుబంధు పేరును మార్చిందే తప్ప అందులోని ‘భరోసా’ని మాత్రం రైతన్నలకు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నాడు నిండు కుండల్లా దర్శనమిచ్చిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు ఇప్పుడు కరువుకు కాసారాలుగా కనిపిస్తున్నాయి.
పచ్చని పంట పొలాలు ఎండిపోతుంటే.. రైతన్నల ఊపిరి బలవంతంగా ఆగిపోతున్నది. అయినా ఆ మూస రాజకీయాలు మారవు. ఏదిఏమైనప్పటికీ పెట్టుబడి సాయం అందక, ఎరువులు దొరకక, సాగునీరు లభించక, మద్దతు ధరలు దక్కక.. మళ్లీ వ్యవసాయం దండగన్న రోజులు రావడం ఎవ్వరూ ఆహ్వానించలేని, ఆశించకూడని మార్పే. ఈ వైఫల్యమే వ్యవసాయ ప్రధాన ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, రైతులకు ఆదాయం దూరం చేసిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ప్రజాపాలన అందిస్తామంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. కొద్దిరోజుల్లోనే ఆ మార్కును చూపించింది.
కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్ర ఆర్థిక ప్రగతి సూచీల పరుగులకు బ్రేకులు మొదలయ్యాయి. నెమ్మదించిన పెట్టుబడులు, మందగించిన వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, ఆయా రంగాల్లో క్షీణించిన వృద్ధిరేటు, కుదేలైన నిర్మాణ-దాని అనుబంధ రంగాలు, నీరసించిన వ్యాపార-పారిశ్రామిక కార్యకలాపాలు, దూరమైన ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, పెరిగిన అప్పుల భారం, తరిగిపోతున్న ఆదాయ వనరులు, మార్కెట్‌ను ఆవహించిన నిస్తేజం, పడకేసిన ఉత్పత్తి, ఆగిన సంక్షేమం.. ఇలా చెప్పుకొంటూపోతే మార్పులు అనేకం.
అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. నిజానికి బడ్జెట్ సందర్భంగా జీఎస్టీ వసూళ్లలో 12.3 శాతం వృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వాస్తవ గణాంకాలు 5.5 శాతాన్ని మించి వృద్ధిని ఆశించకూడదంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆనాడే చెప్పారు. చెప్పినట్టుగానే గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో వృద్ధి 5.1 శాతంగానే నమోదైంది. ఆర్థికపరమైన అంశాల్లో రేవంత్ సర్కారు డొల్లతనానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వంపై అక్కసుతో నాటి అభివృద్ధిని నిందిస్తున్న నేటి పాలకులు.. వ్యక్తిగత వైషమ్యాలను వీడి, ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యర్థులు చూపిన మంచిని సైతం స్వీకరించాలన్న కనీస రాజనీతిని విస్మరిస్తుండటం నిజంగా పెద్ద తప్పిదమే.
మార్కెట్లో పడిపోయిన డిమాండ్‌ను తిరిగి పెంచాలంటే.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే సులువైన మార్గం. అయితే ఇందుకు ప్రభుత్వం అనుసరించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రజానీకం చేతికి మరింతగా నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ-ఉపాధి అవకాశాలను పెంచాలని, రుణ లభ్యతను పెంపొందించాలని కూడా వారు సూచిస్తున్నారు. రైతు భరోసాసహా అనేక సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, పెట్టుబడులను ఆకర్షించే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే నిర్మాణ, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలను ఉత్సాహపర్చాలని పేర్కొంటున్నారు. సులభతర వ్యాపార, వాణిజ్య విధానాలను అమలు చేయాలని, కర్మాగారాల ఏర్పాటుకు పెద్దపీట వేయాలని కూడా గుర్తుచేస్తున్నారు. అప్పుడే రాష్ట్ర జీడీపీ పెరిగి, జీఎస్టీ వసూళ్లు ఊపందుకుంటాయంటున్నారు. నిజానికి గత పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఈ విషయాల్లో ఆసక్తిని చూపడం వల్లే పాలన, ప్రభుత్వం సజావుగా నడిచాయన్నది మరువద్దు.
మార్కెట్లో డిమాండ్ పడిపోవడం వల్లే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గింది. మార్చి నెలలో దేశంలోనే అత్యంత కనిష్ఠంగా తెలంగాణలో ద్రవ్యోల్బణం 1.06 శాతంగా ఉన్నది. కేరళలో అత్యధికంగా 6.59 శాతంగా నమోదైంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం బాధాకరం. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గడానికి మా పాలనే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండటం ఇంకా విడ్డూరం. అయితే ఇదంతా అబద్ధం. అసలు విషయం ఏమిటంటే డిమాండ్ లేక ద్రవ్యోల్బణం లేదు. ప్రజల కొనుగోలు శక్తి పతనం కావడం వల్ల సరకుల ధరలు పెరగడానికి అవకాశం లేకుండాపోయింది.
నిజానికి మార్కెట్లో డిమాండ్ ఉంటే అన్ని వస్తూత్పత్తుల ధరలు నెమ్మదిగా పెరుగుతూపోతాయి. డిమాండ్-సైప్లె సిద్ధాంతం ప్రకారం కొనేవారు ఎక్కువగా ఉన్నప్పుడు సరకుల సరఫరా ఆ మేరకు లేకుంటే మార్కెట్లో బ్యాలెన్స్ తప్పి వాటి ధరలు క్రమేణా పెరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కొంత ఎక్కువగానే ఉండేది. అయితే దీని ప్రాతిపదికనే ఇప్పటి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రచారం చేసుకుంటున్నది.
కానీ బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ప్రజల దగ్గర పైసలుండేవి. వ్యవసాయం బాగుండేది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ.. ఇలా రకరకాల పథకాలతో ఆ రోజుల్లో జనాల దగ్గర, పుష్కలంగా నగదు చలామణి కనిపించేది. నాటి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పకుండా అమలు చేయడమే ఇందుకు కారణం. కాబట్టి అధిక కొనుగోలు శక్తితో డిమాండ్ ఎక్కువగా ఉండి, అప్పట్లో తెలంగాణలో ద్రవ్యోల్బణం కూడా ఆ మేరకు ఎక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు సంక్షేమం కుంటుబడింది. దీంతో అందరి కొనుగోలు శక్తీ తగ్గిపోయింది.
అయినప్పటికీ దీన్ని నేటి ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. రైతుబంధును రైతు భరోసాగా మార్చిన దగ్గర్నుంచి రైతన్నలకు పంట సాయమే కరువైపోయింది. చాలా పథకాలదీ ఇదే దుస్థితి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనాధారమైన వ్యవసాయం చితికిపోయి.. ఎవ్వరి చేతుల్లోనూ పైసల్లేకుండాపోయాయి. ఇలా ప్రజల కొనుగోలు శక్తి పతనం కావడం వల్లే ద్రవ్యోల్బణం తగ్గింది. అంతేగానీ ఇందులో రేవంత్ సర్కారు గొప్పతనమేమీ లేదు.
రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రతికూలమే. ఇటీవల విడుదలైన రాష్ర్టాల జీడీపీ అంచనా గణాంకాల్లో తెలంగాణ ర్యాంకు పడిపోయింది. తలసరి ఆదాయంలోనూ ఇదే దుస్థితి. ఇంకోవైపు మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి సున్నాగా మిగిలింది. దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణలో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తికి జీఎస్టీ కూడా ఓ కొలమానమే. మార్కెట్ లావాదేవీలకు జీఎస్టీ ఓ సూచిక. అలాంటి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి లేదంటే మార్కెట్ నిస్తేజంలోకి జారుకున్నట్టే. ఇంకా లోతుగా చెప్పాలంటే కరోనా తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి. వాస్తవానికి కరోనా ప్రభావం నుంచి రాష్ట ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడానికి అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఓ కారణమే. నాడు ఒకేసారి రూ.8,000 కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం బాగా కలిసొచ్చింది.
ఇప్పుడిలాంటి ప్రోత్సాహకర నిర్ణయాలే కానరావడం లేదు. అప్పట్లో తెలంగాణలో మాదిరే ప్రస్తుతం కేరళలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయి. అందుకే అక్కడి ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నది. మార్కెట్లో డిమాండ్ పెరిగింది కాబట్టే ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ. ఇది అర్థంకాని తెలంగాణ ప్రభుత్వం.. ద్రవ్యోల్బణం తగ్గుదలను ఓ ఘనతగా చూస్తున్నది. ఇప్పటికైనా కండ్లు తెరవకపోతే ముప్పు తప్పదు. అప్రమత్తంగా లేకపోతే సంక్షోభం ఖాయమే.
– డీ పాపారావు
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు