హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ‘మేము అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా దానిపై నోరే మెదపడం లేదు. ఎన్నిమార్లు విన్నవించినా తమ గోడు ఎందుకు పట్టించుకోవడం లేదని కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులను ప్రశ్నిస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని, ఆం దోళనను తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్తున్నారు. తమ గోడు వినిపించేందుకు ప్రజాభవన్‌కు వస్తే మమ్మల్ని లాఠీలతో కొడుతూ, ఈడ్చి వ్యాన్లలో పడేస్తుంటే.. ఇంకెక్కడి ప్రజాపాలన’ అంటూ పలువురు అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
46 జీవో రద్దు గురించి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 46 జీవో ద్వారా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల బాధితులకు ఎక్కువగా అ న్యాయం జరిగింది. ఆయా జిల్లాల నుంచి ఒక్క నేత కూడా జీవో46పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో లేరని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించపోతే ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లో కూడా తిరగనియ్యమని హెచ్చరిస్తున్నారు.
భర్తీ చేసినవారి పోస్టులు తొలగించాలని మేము చెప్పడం లేదు. 1,200 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇంకొన్ని సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేస్తే.. మా సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 2,000 మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.
– బాధిత అభ్యర్థి