హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని కమిషన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లు కుంగితే.. తామేదో నేరం చేసినట్టుగా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించడం ఘోరమని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బరాజ్లున్నాయి. ఇందులో మేడిగడ్డ కూడా ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేశారు. బరాజ్‌లు, పంపుహౌస్‌లు, మోటర్లు, రిజర్వాయర్లు అనేకం కట్టారు. ఎక్కడా చిన్న సమస్య కూడా రాలేదు. ఒక్క మేడిగడ్డలో ఒక చిన్న సమస్య వచ్చింది. దాన్ని కూడా సవరించే అవకాశం ఉన్నది. మేడిగడ్డలో ఏర్పడ్డ కుంగుబాటును సరిచేసేందుకు పూర్తిస్థాయిలో అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తమను వేధింపులకు గురిచేస్తున్నదని, విజిలెన్స్ విచారణలు చేయించడం, కేసులు పెట్టించడం, ఏసీబీ దాడులు చేయించడం, పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నదని చెప్తున్నారు.
దేశంలో కాళేశ్వరంలా రికార్డు సమయంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టునైనా చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుతో తెలంగాణ రైతులకు కావాల్సినన్ని నీళ్లు అందించవచ్చని భావించామని, దీనికి అనుగుణంగా పనిచేసి ప్రాజెక్టు పనులు పూర్తిచేశామని ఓ ఇంజినీరు చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు అందుతున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు మహిమేనని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎండనకా వాననకా ఇంజినీర్లు కష్టపడ్డారు. కుటుంబాలను కూడా వదిలిపెట్టి, యజ్ఙంలా భావించి పనులు చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగ చరిత్రలో రికార్డు సృష్టించాలని భావించారు. ఈ నిర్మాణంలో తమ మేధస్సు, శారీరక శ్రమను ధారపోసిన ఇంజినీర్లు అనేక మంది ఉన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టుల్లో నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత సమస్యలు వస్తుంటాయి. వాటిని ప్రభుత్వాలు పరిష్కరించాలి. భారీ వరదలు వచ్చినప్పుడు ఒకట్రెండు సంవత్సరాలపాటు కొన్ని సమస్యలు వస్తుంటాయి. వాటిని సరిచేసుకుంటూ వెళ్తుంటారు. కానీ, పీసీ ఘోష్ కమిషన్ కేవలం కొన్ని అంశాలనే పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో ఇరిగేషన్ ఇంజినీర్లందరిపై బురద జల్లడంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అద్భుతంగా పనిచేసిన తమ చిత్తశుద్ధిని శంఖించేలా తమ పనితీరును కించపరిచేలా కమిషన్ నివేదిక ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు.
ఇక కమిషన్ తన నివేదికలో నాటి నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావుపైనా పలు వ్యాఖ్యలు చేసింది. అజమాయిషీ లోపం ఉన్నదని, నిర్వహణను పట్టించుకోలేదన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నపుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించేవారు. అర్ధరాత్రి కూడా పనులను పర్యవేక్షించిన ఘటనలు అనేకం చూశాం. అలాంటిది మంత్రిహోదాలో ఆయన పనితీరుపై కమిషన్ చేసిన కామెంట్లు రాజకీయ కామెంట్లలా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆనాటి గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం పనులు చూసి వచ్చి హరీశ్‌రావు పనితీరును మెచ్చుకుంటూ..హరీశ్‌రావు పేరు ఇకపై కాళేశ్వరరావు అని కూడా అన్నారు. ఎప్పుడు చూసినా అక్కడే పనుల్లో నిమగ్నమై కనిపిస్తారంటూ ఆనాటి గవర్నర్ పేర్కొన్నారు.