Medigadda Barrage | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): లక్ష్మీ బరాజ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. పునాదిలో ఇసుక కోత వల్లే 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ స్వల్పంగా కుంగుబాటుకు గురైందని, అది కూడా ఒకవైపు (రివర్ అప్‌స్ట్రీమ్ వైపు) మాత్రమేనని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీ బరాజ్ నిర్మాణానికి ముందు ఎల్అండ్టీ ఇంజినీర్లు, ఇరిగేషన్ అధికారులు అన్ని రకాల పరీక్షలు, పరిశీలనలు చేశారని, సంబంధిత నివేదికల ఆధారంగానే నిర్మాణ పనులను చేపట్టారని వివరించారు.
డిజైన్‌లో, నిర్మాణ నాణ్యతలో లోపాలేమీ లేవని చెప్పారు. ఇంజినీరింగ్ అధికారులు కూడా ప్రాథమికంగా ఇదే నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం పియర్స్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించి, క్షేత్రస్థాయిలో బరాజ్ పునాదిని పరిశీలించనున్నట్టు చెప్పారు. అధ్యయన ఫలితాలతోపాటు కేంద్ర కమిటీ సిఫారసుల మేరకు పునరుద్ధరణ పనులు చేపడతామని వివరించారు. గోదావరిలో ప్రవాహాలు తగ్గుముఖం పట్టాక నవంబర్‌లో పునరుద్ధరణ పనులు చేపట్టి, వేసవిలోగా పూర్తిచేసేందుకు ఎల్అండ్టీతో కలిసి కసరత్తు చేస్తున్నామని, సొంతంగా చేపట్టేందుకు ఎల్అండ్టీ సంస్థ ఇప్పటికే సంసిద్ధత తెలిపిందని పేర్కొన్నారు. లక్ష్మీ బరాజ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీకి అందజేశామనారు., వారు కోరిన అదనపు సమాచారాన్ని త్వరలో అందజేస్తామని చెప్పారు.