Telangana | హైదరాబాద్ : ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో సెక్రటేరియట్ 6వ ఫ్లోర్ లో ఉద్యోగ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఇటీవలే క్యాబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగుల డిమాండ్లపై రిపోర్ట్ ఇచ్చిన ఐఏఎస్ నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
రేపు క్యాబినెట్లో ఉద్యోగ సమస్యలు, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు మరో ఏడాది పెంచుతారానీ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెండింగ్ డీఏలు, ఇతర డిమాండ్లపై కూడా భట్టి నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించనున్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఏ ఏ అంశాలపై చర్చకు వస్తుందన్నదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంఘాలు ఇటీవల ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఉద్యోగ సంఘాల ఆల్టిమేటంతో దిగివచ్చిన ముఖ్యమంత్రి కేబినెట్లో చర్చించి ఉద్యోగులకు సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా కొత్తగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఒక ఏడాది పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఉద్యోగ సంఘాలతో జరుగుతున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీనిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది.