హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘సార్.. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సీపీఎస్‌ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ మీటింగ్‌లోనే శుభవార్త చెప్పండి’ అంటూ జేఏసీ నేత ఒకరు మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరారు. స్పందించిన మంత్రులు ‘మేం మీటింగ్ పెట్టడం, మిమ్మల్ని చర్చలకు పిలవడమే తీపికబురు’ అనడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఉసూరుమన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డీ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, త్రీమెన్ కమిటీ సభ్యులు నవీన్‌మిట్టల్, కృష్ణభాస్కర్, లోకేశ్‌కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. గతంలోని 57 డిమాండ్లతో పాటు మొత్తం మొత్తం 212 సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. అయితే సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నిర్దిష హామీ ఇవ్వలేదు. క్యాబినెట్లో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని మాత్రమే కమిటీ హామీనిచ్చింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపును జేఏసీ నేతలు కొందరు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. వయోపరిమితి పెంపుతో తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వతం పరిష్కారం దొరకదని, ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలతో భేటీ ముగిసిన తర్వాత పలువురు జేఏసీ నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై బహిరంగంగానే విస్మయం వ్యక్తంచేశారు. ‘రమ్మన్నదేమో మధ్యాహ్నం 3 గంటలకు. సమావేశం ప్రారంభమైందేమో 4: 30 గంటలకు. మేం గంటన్నర పాటు వేచిచూడాల్సి వచ్చింది’ అని ఓ నేత వాపోయారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటై ఎనిమిది నెలలైంది. అనంతరం మొదటిసారి సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమస్యల పరిష్కారంపై నిర్దిష్ట హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థం చేసుకోవచ్చని మరో నేత విమర్శించారు. ఆర్థికేతర సమస్యలపైనా ఓ నిర్ణయం తీసుకోలేరా? అంటూ సమావేశంలో పాల్గొన్న మరో నేత అసంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పుల్గం దామోదర్‌రెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎనుగుల సత్యనారాయణ, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, శ్యామ్, సదానందంగౌడ్, కటకం రమేశ్, సంగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేయాలని టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ బుధవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కే హన్మంతు, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బీ యాదగిరి ఓ ప్రకటన విడుదల చేశారు.
గురువారం సమావేశం కానున్న మంత్రివర్గం ఉద్యోగుల సమస్యలను చర్చించే అవకాశం ఉన్నదని తెలిసింది. ఐదు పెండింగ్ డీఏలకు రెండు డీఏలపై ప్రకటన వచ్చే అవకాశమున్నది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ వంటి సమస్యలపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. గ్రీన్‌చానల్ ద్వారా పెండింగ్ బిల్లులను క్లియర్చేస్తామన్న ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తుందని జేఏసీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.