కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులు జంగ్‌సైరన్ మోగించారు. వాగ్దానాలు నెరవేర్చలేదంటూ ఆగ్రహించారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో గురువారం ధర్నాలు నిర్వహించారు. ‘ఓపీఎస్ ముద్దు.. సీపీఎస్ రద్దు’.. పీఆర్సీ, డీఏలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు. హామీల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. మోసపూరిత విధానాలు మానుకొని, డిమాండ్లు నెరవేర్చకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగులు హెచ్చరించారు.
జీవో- 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలకు దిగారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే తమ విద్యాభ్యాసం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడుతూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలతో హోరెత్తించారు. ‘శక్తి’ని రద్దు చేసేంత వరకూ వెనక్కి తగ్దేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యూరియా యాప్‌లు పని చేయడం లేదంటూ రైతులు నిరసనల బాట పట్టారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలంటూ రోడ్డెక్కారు. కాళ్లరిగేలా తిరిగినా అసలు యూరియా దొరుకడం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు.
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక దగా చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై రాష్ట్రంలో అన్ని వర్గాలు కదం తొక్కుతున్నాయి. మూడేండ్లు పూర్తయినా తమ సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుండటంపై పోరుబాట పట్టాయి. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏల అమలు, తదితర డిమాండ్లు నెరవేర్చలేదని ఉద్యోగులు, జీవో- 97తో తమ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు. మరోవైపు యూరియా యాప్ రద్దు చేసి, పాత విధానంలో పంపిణీ చేయాలని రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. హనుమకొండలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు అండగా ఉంటున్న ప్రతిపక్షనేతలపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండ కొనసాగుతున్నది. ప్రజల్లోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులకు దిగుతున్నది. గురువారం హనుమకొండలో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. సాంకేతిక విద్యాశాఖలోనే తమను కొన సాగించాలని డిమాండ్ చేశారు. నిరసనలకు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగానే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు

అధికారం చేపట్టి సగం కాలం పూర్తయినా ఇప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చకుండా తాత్సారం చేస్తుండటంపై ఉద్యోగులు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ఉద్యోగుల అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కారు. ఇందిరాపార్కు ఎదుట మహాధర్నాకు దిగారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 27 : రేవంత్ సర్కార్‌పై ఉద్యోగులు సమరభేరి మోగించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగులు నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు.

కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని చోట్లా కలెక్టరేట్లు దద్దరిల్లాయి. ఆయాచోట్ల ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూడేండ్లు అయినా ఇంకా పీఆర్సీ ప్రకటించలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆరు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని, ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు.

ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు లేవని, బదిలీలు చేపట్టడం లేదని ఆవేదన చెందారు. జీవో 25 ద్వారా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ దూర మండలాలకు బదిలీ చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ ఒకటిన సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని ఉద్యోగుల ఆరు డీఏలను పెండింగ్ పెట్టడం, పీఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణం ఉండేదని, ప్రత్యేక ఇంక్రిమెంట్‌తోపాటు 73శాతం ఫిట్మెంట్ ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఉద్యోగులు, పింఛన్‌దారుల సమస్యలను పరిషరించాలని, హెల్త్ ప్రాజెక్ట్(ఈహెచ్ఎస్)ను సక్రమంగా అమలుచేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవో-97ను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశా రు. ప్రజాసమస్యల పై శాంతియుతంగా పోరాడుతున్న బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, మాజీ మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్ వినయ్‌భాసర్ తదితరులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.

పెట్రోలియం, సహజవాయువుశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తమిళనాడులోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(సీపీసీఎల్) ప్రధాన రిఫైనరీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వినియోగదారుల భవిష్యత్ అవసరాలు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని చమురు సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించాలని, ప్రాంతీయ కార్యాలయాల సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు.