హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గురువారం తలపెట్టిన ఉద్యోగుల హక్కుల సాధన సభ తాత్కాలికంగా వాయిదాపడింది. జేఏసీ నేతలతో చర్చలు జరిపిన సర్కార్ మూడు అంశాలపై లిఖిత పూర్వకమైన హామీనిచ్చింది. పీఆర్సీ కమిటీ నివేదికను త్వరితగతిన పూర్తిచేసి ప్రభుత్వానికి సమర్పించాలని కోరుతూ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌కు స్వయంగా సీఎస్ లేఖ రాయాలని నిర్ణయించింది. సీపీఎస్‌పై సమగ్ర అధ్యయనానికి పీఆర్సీ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల సభ్యులతో ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తున్నది.
వీటితో పాటు డీఏలు, పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు జేఏసీ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ నెల 18న సమావేశం నిర్వహిస్తామని జీఏడీ స్పెషల్ సీఎస్ బీ మహేశ్ దత్ ఎక్కా బుధవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీంతో జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదావేసింది. ఇది తాత్కాలిక వాయిదా మాత్రమేనని, ఈ నెల 18న ఎలాంటి పురోగతి లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం నాంపల్లి టీఎన్జీవో భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎస్ ఇచ్చిన రాతపూర్వక హామీతోనే విరమించినట్టు ప్రకటించారు. 18న సానుకూల నిర్ణయం రాకపోతే 19న జేఏసీ సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తేల్చిచెప్పారు.
ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన హక్కుల సాధన సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో జేఏసీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సరూర్‌నగర్ స్టేడియంలో ధర్నాకు అనుమతినిచ్చింది. అయితే అసెంబ్లీ జరుగుతుండటం, ఉద్యోగులంతా సెలవులు పెట్టే పరిస్థితి లేకపోవడం, మరోవైపు సర్కార్ హామీనివ్వడంతో సభను వాయిదావేసినట్టు మారం జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, కో చైర్మన్లు సీహెచ్ రవి, సదానందంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, గౌతం కుమార్, కటకం రమేశ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), బీ శ్యామ్, రాధాకృష్ణ, గండూరి వెంకటేశ్వర్లు, శ్రీనేష్‌కుమార్, ఎంబీ కృష్ణాయాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్టు తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సంకల్ప సభ ప్రభావంతోనే సర్కార్ చర్చలకు ఆహ్వానించిందని, పలు అంశాలపై సానుకూలంగా స్పందించిందని లచ్చిరెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయ మీడియా సెంటర్లో మాట్లాడిన ఆయన ఉద్యోగులు హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, రాములు, పాక రమేశ్, దర్శన్‌గౌడ్, కుమారస్వామి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.