Telangana Emblem | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో వెనకడుగు వేసింది. లోగోలో ఉన్నవి తీసేసి, లేనివి తీసుకొచ్చి పెట్టాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, విపక్షాలు, ఉద్యమకారులే కాకుండా సామాన్య ప్రజల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతోనే చిహ్నం విషయంలో రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే క్యాబినెట్లో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం సచివాలయంలో కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, రాష్ట్ర మంత్రులు, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టు ప్రకటించారు.
దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా జూన్ 2న ఈ గీతాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర గీతంతోపాటు దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయకుల బృందం గీతాన్ని ఆలపించింది. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రెండు వెర్షన్లలో రూపొందించినట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. పూర్తి గీతం 13.30 నిమిషాలు ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో సంక్షిప్త గీతం 2.30 నిమిషాలు ఉంటుందని వివరించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో అందరినీ ఉర్రూతలూగించిన, తెలంగాణ ఖ్యాతిని చాటిన గీతాన్ని భవిష్యత్తు తరాలు పాడుకునేలా అందరి ఆమోదంతోనే రాష్ట్ర గీతంగా ఆమోదించినట్టు తెలిపారు. కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఆసార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతోపాటు స్వరాలు కూడా కూర్చినట్టు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చిహ్నంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్టు చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక, కొండా సురేఖతో పాటు మాజీమంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.