హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ)/దోమలపెంట : దేశవ్యాప్తంగా విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిలుపు మేరకు గురువారం మధ్యాహ్న భోజన సమయంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. టీజీపీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు మాట్లాడుతూ..
దేశంలోని 27లక్షల విద్యుత్తు ఉద్యోగులు ప్రైవేటీకరణపై నిరసన తెలిపినట్టు పేర్కొన్నారు. యూపీలో విద్యుత్తు సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ 184 రోజులుగా విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారని తెలిపారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులను అప్రజాస్వామికంగా సర్వీస్ నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సంస్థలు, జనరేటింగ్ స్టేషనల్లో ఈ నిరసనలు కొనసాగినట్టు వెల్లడించారు. జేఏసీ నేతలు బీసీ రెడ్డి, సదానందం, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
యూపీలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించొద్దంటూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ కోచైర్మన్ చరణ్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఉద్యోగ భద్రత ఉండదని, పేదలకు ఇస్తున్న విద్యుత్ క్రాస్ సబ్సిడీలు ఎత్తేసే ప్రమాదం ఉందని చెప్పారు.