హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారపర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో రానున్న 48 గంటలపాటు ఎవరూ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పష్టంచేశారు. సోమవారం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామ ని తెలిపారు.
ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ముగిసే వరకు జెండాలు, బ్యానర్లు, డిస్ప్లే బోర్డులు, లౌడ్స్పీకర్లు, బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం విధించినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నలుగురు కన్నా ఎక్కువమంది ఒకేచోట గుమిగూడేందుకు వీల్లేదని తెలిపారు. వచ్చే 48 గంటలపాటు ఎలాంటి ఫిర్యాదు అందినా 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటామని చెప్పా రు.
ఈ రెండు రోజుల్లో ఎవరైనా వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికలను ప్రభావితం చేసేలా టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టంచేశారు. పోలింగ్ శాతాన్ని పెం చేందుకు విద్యార్థులు, ఎన్జీవోలు, పౌరసంఘా ల ద్వారా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, గతంలో తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్క డ ఎక్కువగా ప్రచారం చేశామని చెప్పారు.
ఈవీఎంల వాహనాలకు జీపీఎస్
ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నేరుగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేసినట్టు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత వాటిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లపై సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సైతం చూసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు.
జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్‌పోల్ ఫలితాలు
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు సోమవారమే పూర్తవుతున్నప్పటికీ దేశవాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ జూన్ 1 వరకు కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో జూన్ 1 సాయంత్రం 6.30 వర కు ఎగ్జిట్‌పోల్ ఫలితాలను వెల్లడించరాదని వికాస్‌రాజ్ స్పష్టంచేశారు. పోలింగ్ నేపథ్యం లో 13న రాష్ట్రంలోని అన్ని రకాల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించామని, దీన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు.
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని విలేకరులు సీఈవో వికాస్‌రాజ్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ను 48 గంటలపాటు ప్రచారానికి దూరంగా ఉం చిన విషయాన్ని విలేకర్లు గుర్తుచేస్తూ.. ప్రధాని మోదీ సహా ఇతర పార్టీల నేతలు చేసిన అభ్యంతరకర ప్రసంగాలపై ఫిర్యాదులేమైనా వచ్చా యా? వస్తే వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై వికాస్‌రాజ్ స్పందిస్తూ.. వివిధ రాజకీయ పార్టీలపై 92 ఫిర్యాదులు అందాయని, ఆయా పార్టీలకు నో టీసులు జారీచేయడంతో సమాధానం ఇచ్చేందుకు సమయం కోరాయని వివరించారు.
13 అసెంబ్లీ స్థానాల పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్
నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట తదితర 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం 7 నుంచి సాయం త్రం 4 వరకే పోలింగ్ జరుగుతుంది. ఈ సెగ్మెం ట్ల పరిధిలో శనివారం సాయంత్రం 4కే ప్రచారం ముగిసింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏలు ఖరారు
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి టీఏ, డీఏలను ఖరారుచేశారు. పీవో, ఏపీవో, కౌంటింగ్ సూపర్వైజర్లకు రోజుకు రూ.600, పోలింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్లకు రూ.400, నాలుగోతరగతి ఉద్యోగులకు రూ. 300 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.
తుది పోలింగ్ శాతం తెలిసేది మరుసటిరోజే
పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఉదయం నుంచే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సామగ్రిని అందజేయనున్నట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు జరిగే మాక్ పోలింగ్‌లో అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. అదే రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యాక ప్రతి 2 గంటలకోసారి పోలింగ్ శాతాన్ని, మరుసటి రోజు తుది పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తామని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యాక అన్ని కేంద్రాల నుంచి రిసెప్షన్ సెంటర్లకు ఈవీఎంలను తరలిస్తామని చెప్పారు.
విధుల్లో భద్రతా బలగాలు