పీర్జాదిగూడ, జూలై 19 : తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కార్పొరేట్ వసతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్ విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎ.వి. కన్స్ట్రక్షన్ సౌజన్యంతో విద్యార్థుకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యనందించడానికి ప్రభుత్వం సుమారు రూ. 7289 కోట్లతో మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కష్టపడితే ఏదైనా సాదించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల శ్రద్ధ చూపిస్తున్న పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలక వర్గాన్ని మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి, మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డీఈవో విజయకుమారి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్ నాయక్, బచ్చరాజు, నాయకులు అంజిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్, సతీష్‌గౌడ్, తదితరలు పాల్గొన్నారు.