Junior Colleges | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామీణ, నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా? 50 ఏండ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలువనున్నాయా? అంటే పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎత్తివేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్’ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొత్తగా ఏర్పాటుచేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవలే కమిషన్ సర్కారుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ప్రతి మండలంలో మూడు పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుచేయాలని, వీటిలోనే నర్సరీ నుంచి ఇంటర్ వరకు నిర్వహించాలని సూచించింది. ఒక్కో పబ్లిక్ స్కూల్‌ను 1,500 మంది విద్యార్థులతో నిర్వహించాలన్నది. పదో తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండా ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలని సిఫారసు చేసింది. ఒకే ప్రాంగణంలోని ల్యాబ్‌లు, ఆటస్థలం, డైనింగ్ హాళ్లను ఉమ్మడిగా వాడుకునేలా చూడాలని సర్కారుకు సూచించింది.
1969-70లో పీవీ నర్సింహారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి విజయవంతంగా నడుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్ విద్య సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. నేడు ఐఐటీలు, ఎన్ఐటీల్లో 15-20 శాతం మన విద్యార్థులున్నారంటే అందుకు ఇంటర్ విద్యావ్యవస్థే కారణం. మెడికల్ సీట్లను అత్యధికులు పొందుతుండడం కూడా ఇంటర్ విద్యతోనే. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎంతో ప్రయోజకులవుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవన్నీ దాదాపు మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నారు. విద్యార్థుల నుంచి కేవలం పరీక్ష ఫీజు మాత్రమే తీసుకుంటున్న కాలేజీలను ఎత్తివేయాలని విద్యాకమిషన్ సిఫారసు చేయడం గమనార్హం. విద్యాకమిషన్ సిఫారసులను ఇంటర్ అధ్యాపక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్ సిఫారసులను సర్కారు అమలుచేస్తే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. లక్షల ఫీజుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ కాలేజీలను అదుపుచేయడంపై విద్యాకమిషన్ ఎందుకు దృష్టిసారించడం లేదని ప్రశ్నిస్తున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలనడం ఆత్మహత్యా సదృశ్యం. ఇలాంటి ప్రతిపాదనలతో విద్యావ్యవస్థను 60 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లడమే అవుతుంది. ఇంటర్ విద్యతోనే మన పిల్లలు జేఈఈ, నీట్లో రాణిస్తున్నారు. ఎంబీబీఎస్, ఐఐటీ సీట్లు పొందుతున్నారు. ఈ కాలేజీలను బలోపేతం చేసేలా విద్యాకమిషన్ సిఫారసులు ఉంటాయనుకున్నాం. ప్రైవేట్ కాలేజీల ఆగడాలను అరికడతాయనుకున్నాం. కానీ, సర్కారు కాలేజీలకు ఉరి బిగించేలా ఉండటం ఆందోళనరం.
– డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్
ఇంటర్ విద్యను నాశనం చేసేలా విద్యా కమిషన్ సిఫారసులున్నాయి. ఈ సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త సర్కారు కాలేజీల కోసం అనేక ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల పెద్దఎత్తున కొత్త కాలేజీలు ఏర్పాటుచేశారు. సర్కారు జూనియర్, గురుకుల కాలేజీలు కలిపితే ప్రైవేట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి. ఇలాంటి కాలేజీలను పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలనుకోవడం దారుణం.
– జంగయ్య, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు