DSC | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్ కే కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనున్నది.
పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వలేదని, సిలబస్ అధికంగా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 18 నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుండటం, హైకోర్టు అదేరోజు కేసును విచారించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని పోరాటం చేస్తూనే, డీఎస్సీని వాయిదా వేయాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో మంగళవారం దీక్ష చేశారు.
రేపటి నుంచే పరీక్షలు
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి ప్రారం భం కానున్నాయి. 18న ప్రారంభమై ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 26వేల మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ఇప్పటి వరకు 2.2 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
డీఎస్సీలో 11,062 పోస్టులను భర్తీ చేయనుండగా 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 1.61 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎస్జీటీ పోస్టులు 6,508 ఉండగా, 88వేల మంది పోటీపడుతున్నారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ 11 వేలకే పరిమితం చేసింది. సిలబస్ అధికంగా ఉండటం, ప్రిపేరయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో డీఎసీ వాయిదా వేయాలని కొంతకాలంగా అభ్యర్థులు పోరాడుతున్నారు.
దరఖాస్తుల వివరాలు
పోస్టు : దరఖాస్తులు
స్కూల్ అసిస్టెంట్ : 1,61,746
సెకండరీ గ్రేడ్ టీచర్ : 88,007
భాషా పండితులు : 18,211
పీఈటీ : 11,992
మొత్తం : 2,79,956