‘కరువు’లోనూ వివక్షే!
అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికార పార్టీ పెద్దలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, కరువు సాయంలోనూ వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- కరువు మండలాల ఎంపికతో తేటతెల్లం.. మంత్రుల నియోజకవర్గాలకే ప్రాధాన్యం
- క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే 365 మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికార పార్టీ పెద్దలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, కరువు సాయంలోనూ వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరువు మండలాల ఎంపికలోనూ కక్షసాధింపునకు దిగిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అన్ని మండలాలనూ, డిప్యూటీ సీఎంకు చెందిన మధిర నియోజకవర్గంలో చింతకాని మినహా మిగిలిన మండలాలను కరువు జాబితాలో చేర్చారు.
కొడంగల్‌లో బొంరాస్పేటను మధ్యస్థ కరువు మండలంగా, మిగిలిన కొడంగల్, దౌల్తాబాద్, కోస్గి, మద్దూరును తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించారు. మధిరలో చింతకానిని మినహాయించి మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ముదిగొండను తీవ్ర కరువు జాబితాలో చేర్చారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఎనిమిదింటికీ మూడు, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో నాలుగింటికి ఒకటి, కేటీఆర్‌కు చెందిన సిరిసిల్లలో ఆరు మండలాలకుగాను రెండు మండలాలను మాత్రమే కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
కరువు మండలాల లెక్కలు చూస్తుంటే, సర్కార్ వివక్షకు అద్దంపడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. కరువు మండలాల ఎంపికలోనూ రాజకీయకోణం చూపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాలను కరువు జాబితాలో చేర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రెండు, మూడు రోజుల నుంచి రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు.
చెప్పేదొకటి..చేసింది మరొకటి..
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రమంతా భయంకరమైన కరువు కోరల్లో చిక్కుకున్నదని, చుక్కనీరు కూడా దొరుకదని, రైతులు పంటలు వేయొద్దని భయపెట్టిన ప్రభుత్వం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, 365 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అందులోనూ కేవలం 111 మండలాల్లో తీవ్రమైన కరువు, మిగిలిన 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉంటుందని వెల్లడించింది. 31 జిల్లాలకు గానూ నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలో 28 మండలాలు, సూర్యాపేటలో 23, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 20, నిజామాబాద్, రంగారెడ్డిలో 18, యాదాద్రి భువనగిరి, ఖమ్మంలో 17, భద్రాద్రి కొత్తగూడెంలో 16, హనుమకొండలో 14, జోగుళాంబ గద్వాల,
మహబూబ్‌నగర్, నారాయణపేటలో 13, మంచిర్యాల, వనపర్తిలో 11, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్‌లో 9, సిద్దిపేట, వరంగల్‌లో 8, మహబూబాబాద్‌లో 7, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 5, జనగామ, కామారెడ్డి, ములుగులో 4, జగిత్యాల, కరీంనగర్లో 3, రాజన్నసిరిసిల్లలో 2, మెదక్‌లో ఒక మండలం చొప్పున కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చారు. ఇందులో సీఎంకు చెందిన వికారాబాద్ జిల్లాలో 20 మండలాలు, మంత్రి కోమటిరెడ్డికి చెందిన నల్లగొండలో 28, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెందిన సూర్యాపేటలో 23 మండలాల చొప్పున ఉండగా, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో కేవలం 2, మెదక్‌లో కేవలం ఒక ఒక్క మండలాన్నే కరువు జాబితాలో చేర్చడం చూస్తుంటే వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అశాస్త్రీయంగా కరువు మండలాలు
కేంద్రం మార్గదర్శకాలు పాటించకుండా పూర్తి అశాస్త్రీయంగా కరువు మండలాల జాబితాను రూపొందించిందనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రాట్ మేనేజ్మెంట్ మాన్యువల్-2020 ప్రకారం వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, జలవనరుల పరిస్థితి అంటే భూగర్భ జలాల మట్టం, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను ప్రతిమండలంలోని 10% గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ఎంపిక చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల పరిధిలోని మండలాలనే కరువు జాబితాలో చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా సర్వే చేసి కేవలం కలెక్టర్ల నివేదికల ఆధారంగానే ఎంపిక చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 36% లోటు వర్షపాతం ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో అనేక మండలాలను కరువు జాబితాలో చేర్చకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
వెల్లువెత్తుతున్న నిరసనలు
కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపిన ప్రభుత్వంపై ప్రజలు కన్నెర్ర జేస్తున్నారు. అనేక మండలాలను విస్మరించిందని, సర్వే చేయకుండానే జాబితాను రూపొందించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. రెండు రోజుల క్రితం రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులోనూ ఆందోళనలు జరిగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

