హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఇప్పటిరకు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులను జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుబంధు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌తో మంత్రి శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 40 శాతం (27 లక్షల) మంది రైతులకు మాత్రమే రైతుబంధు నిధులు జమయ్యాయని అధికారులు వెల్లడించారు.
అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. యాసంగి సాగు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతుబంధు సొమ్మును వెంటనే జమచేయాలని ఆదేశించారు. ఈ అంశంపై సంక్రాంతి తరువాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. ఇటీవల కార్పొరేషన్ల పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల.. కార్పొరేషన్ల పనితీరు వివరాలపై విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకే రకమైన పనిని వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న వేర్వేరు కార్పొరేషన్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల పని విభజనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆ తర్వాత కార్పొరేష్ల పనితీరుపై క్షుణ్ణంగా చర్చించి పలు కార్పొరేషన్ల పనుల్లో కోత పెట్టనున్నట్టు సమాచారం. ప్రతి కార్పొరేషన్ సొంత ఆదాయ మార్గాలను అన్వేషించాలని, ఇందుకోసం ఇతర వ్యాపారాలను కూడా నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిసింది.