CM Chandrababu | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను ఏపీకి మళ్లించడం గమనార్హం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గం ఎవరూ స్పందించకపోగా.. ఈ పరిణామాలతో తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు విస్తుపోతున్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 54 [1] స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నదని మండిపడుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య జనాభా దామాషాలో ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 54 [1] స్పష్టం చేస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం దేశీయంగా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి తెచ్చిన రుణాలతోపాటు జపాన్‌కు చెందిన జైకా, వరల్డ్ బ్యాంకు వంటి విదేశీ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు కూడా పంపకాల్లో భాగంగా ఉన్నాయి. విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన నిధులు రూ.30వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం, నిధుల వినియోగాలతో సంబంధం లేకుండా రెండు రాష్ర్టాల మధ్య అప్పుల పంపకం జరగాల్సి ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 ప్రాజెక్టులకు చెందిన అప్పులపై కొర్రీలు పెట్టారు. తొమ్మిది ప్రాజెక్టుల అప్పును వినియోగం ఆధారంగా, మరో నాలుగు ప్రాజెక్టుల రుణాలను అవి ఉన్న ప్రాంతం ఆధారంగా, మరో రెండు ప్రాజెక్టుల రుణాలను జనాభా ప్రాతిపదికన పంచాలని పట్టుబట్టారు. కానీ.. ఆ అప్పులను సెక్షన్ 54 [1]కు లోబడి జనాభా ప్రాతిపదికన పంచాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పిందని, దీంతో బాబు ఆటలు సాగలేదని పరిశీలకులు పేర్కొన్నారు.
ఏపీలో చంద్రబాబు గెలిచిన వెంటనే తనదైన మార్క్ రాజకీయాలు మొదలు పెట్టారు. ఇక్కడ రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడంతో పాత బంధాన్ని గుర్తుచేస్తూ ‘విభజన సమస్యలపై చర్చించుకుందాం రా’ అంటూ స్నేహహస్తం చాచారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీన ఇరు రాష్ర్టాల సీఎంలు భేటీ అయ్యారు. అయితే ఇక్కడి నుంచే చంద్రబాబు పాచికలు వేయడం మొదలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సీఎంలు చర్చించిన అంశాలపై అధికారులు, మంత్రుల కమిటీల్లో చర్చించి, రెండు రాష్ట్రాలు ఒక పరిషార మార్గం వెతుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నేరుగా కేంద్ర మంత్రిత్వశాఖ వద్దకు వెళ్లారని.. సమైక్య రాష్ట్రంలో విదేశీ నిధులు తెచ్చి చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ పనులకు సంబంధించి తెలంగాణ తన వాటా చెల్లించడం లేదని, ఏపీనే ఆ మొత్తం కట్టిందని చెప్పారని అంటున్నారు. ఈ నిధులను తెలంగాణ నుంచి వసూలు చేసి, ఏపీకి చెల్లించాలంటూ చక్రం తిప్పినట్టు చెప్తున్నారు. దీంతో చంద్రబాబుకు తలొగ్గిన కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని.. తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండానే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2,500 కోట్లను ఏపీ ఖాతాలో వేసిందని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా సతమతం అవుతున్న తెలంగాణకు ఇది ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది. ఈ పరిణామాలపై ఆర్థిక శాఖ అధికారులు సైతం విస్తుపోతున్నారు. అప్పుల్లో తెలంగాణ వాటా తేల్చడంపై విజ్ఞప్తి ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా నిధులు ఎలా బదలాయిస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అడుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) నిధులు రూ.454 కోట్లు ఏపీ ఖాతాలో పడ్డాయి. ఈ నిధులు తిరిగి ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం పదేండ్లుగా అడిగినా కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2,500 కోట్లు మళ్లించిన కేంద్రం.. ఇదే పద్ధతిలో సీఎస్ఎస్ నిధులను ఏపీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఎందుకు ఇవ్వదని ప్రశ్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఈ అంశంపై నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు వాటా తేలకుండా మిగిలిపోయిన అప్పులు, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు బకాయిల వంటివి కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇప్పించాలని డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు.