హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. తెలంగాణ డిజిటల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలో జాతీయ జెండాను తలకిందులుగా పెట్టి అవమానించారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారాలను పర్యవేక్షించే డిజిటల్ మీడియా వింగ్ జాతీయ పతాకాన్ని అవమానించటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మేడ్చల్‌లో తలకిందులుగా జెండా..
మేడ్చల్ మున్సిపాలిటీలోని వివేకానంద విగ్రహం పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. అంతటితో ఆగకుండా జెండా తలకిందులుగా ఉందని గుర్తించి కిందకు లాగేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.