హైదరాబాద్, ఆక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ): బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం నిర్వహించ తలపెట్టనున్న రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగేలా సంఘాల బాధ్యులు పర్యవేక్షించాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సంఘాల బాధ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.