హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంసరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులెవ్వరూ విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని హితవు పలికారు. ‘సమర్థ పోలీసింగ్ ప్రమాణాల అవలంబన’ అనే అంశంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలతో ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజారోగ్య రక్షణ కోసం ఆహార కల్తీ నిరోధక విభాగాన్ని (ఫుడ్ అడల్టరేషన్ వింగ్), ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నిరోధానికి పెద్దపీట వేయాలని, ఈ కేసుల్లో ఎలాంటి రా జీ పడకూడదని స్పష్టం చేశారు. అ న్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు ప్రతి నె లా 15వ తేదీ లోపు క్రైమ్ రివ్యూలు నిర్వహించాలని, ఆ నివేదికలను అదే నెల 20లోపు డీజీపీ కార్యాలయానికి, సీఐడీకి పంపాలని ఆదేశించారు.
ప్రతి పోలీస్ యూనిట్ రోజూ మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాధితుల కోసం సమయాన్ని కేటాయించడం తప్పనిసరి అని ఆదేశించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బకాయిలపై ఇటీవలే ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమీక్షలో డీజీలు మహేశ్ ఎం భగవత్, వీవీ శ్రీనివాసరావు, చారుసిన్హా, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, గజరావ్ భూపాల్ పాల్గొన్నారు.