Telangana | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : 3 గంటల కరెంట్ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటే చాలని.. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడటం.. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తమ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, 5 గంటలే ఇస్తున్నామని పదేపదే చెప్పడంతో కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలేనని ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసిమరీ రైతుబంధును ఆపే ప్రయత్నం చేయడంతో క్షేత్రస్థాయిలో హస్తం నేతలకు వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. తాజాగా, రైతుభరోసాపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతాంగాన్ని అయోమయంలో పడేశాయి. కాంగ్రెస్‌ను నమ్మితే కటిక చీకట్లే.. సాగు ఖతమే.. మళ్లీ పాతరోజులే వస్తాయనే ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొన్నది. దీంతో పదేండ్లలోనే దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపిన బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రూ.వేల కోట్ల సంక్షేమం.. మొదటి విడతకు మించి రెండో విడతలో అభివృద్ధి కనిపిస్తుండడంతో ‘మళ్లా కారుకే ఓటు.. మరోసారి సారుకే మా మద్దతు’ అని ప్రజలు తేల్చి చెప్తున్నారు. దీంతో అభివృద్ధికి.. అరాచకానికి మధ్య జరుగుతున్న పోరులో బీఆర్ఎస్ విజయం పక్కా అని తేలిపోయింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ప్రజలు నినదిస్తున్నారు. అధికార పార్టీపైనా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర నేతలపై బురద జల్లడం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీని మరో ఐదేండ్లు ప్రతిపక్షంలోనే ఉంచాలని ప్రజలు నిర్ణయించుకొన్నారు. వార్ వన్ సైడ్ చేయాలని డిసైడయ్యారు.
గులాబీదే విజయం
తెలంగాణలో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది. యావత్తు తెలంగాణ ‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్’ అని నినదిస్తున్నది. ‘ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయింది తెలంగాణ’ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నినాదం వినిపిస్తున్నది. ప్రజలను ఆలోచింపచేస్తున్నది. స్వరాష్ర్టాన్ని సాధించడమే కాదు.. పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే తాము పట్టంగడతామని రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో నినదిస్తున్నది. గత ఎన్నికల్లో కంటే ఈసారి రెండు సీట్లు ఎక్కువే గెలుచుకొని, 90 సీట్లతో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
‘మళ్లా కారుకే.. మరోసారి కారుకే’ అనే మాట అన్ని నియోజకవర్గాల్లోనూ వినిపిస్తున్నది. కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ చీకట్లోకి వెళ్లబోమని, బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ గెలిపించుకొని అభివృద్ధి బాటలో పయనిస్తామని యావత్తు తెలంగాణ శపథం చేస్తున్నది. మొత్తం గా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాబలం, అభ్యర్థులకున్న మంచి పేరు, వారు చేస్తున్న సేవలు, పనుల ముందు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న గారడీలు తెలిసిపోయి బీఆర్ఎస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు.
సిరిసిల్ల
సిరిసిల్లలో ఒక్కటే మాట.. తగ్గేదేలే!
50 ఏండ్లలో జరగని అభివృద్ధిని మంత్రి కేటీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించారు. మళ్లీ పట్టం కట్టి తమ కృతజ్ఞతను చాటుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. పంచాయతీ మొదలుకుని ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ నేతలే విజయం సాధించారంటే ‘వార్ వన్‌సైడ్ ఉన్నట్టేనని అర్థమైపోతున్నది. రామన్న అని పిలుచుకునే కేటీఆర్‌ను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న సిరిసిల్ల ప్రజలు ఈసారి ‘తగ్గేదే లే’ అంటూ మరింత భారీ మెజార్టీతో పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.
మంథని
వెయ్యి కోట్ల అభివృద్ధికే మొగ్గు
మొదటి నుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మంథనిలో 2014 ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. పుట్ట మధూకర్ విజయం సాధించారు. అప్పటి నుంచి అప్రతిహతంగా అన్ని ఎన్నికల్లో కారు దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన సీఎం కేసీఆర్ మంథని నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. బీసీలు ఒక్కతాటిపైకి వచ్చి మధూకర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
పెద్దపల్లి
దాసరి హ్యాట్రిక్ పక్కా
పెద్దపల్లి నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దాస రి మనోహర్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నా రు. తాజా పరిస్థితులను చూస్తే.. మరోమారు పెద్దపల్లిపై గులాబీ జెం డా ఎగరడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమనే ప్రచారంతో నియోజకవర్గ వ్యాప్తం గా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. మనోహర్‌రెడ్డి విజయం దాదాపు ఖాయమైంది.
జగిత్యాల
మంచితనానికి మళ్లీ ఓటు
జగిత్యాల నియోజకవర్గంలో ఏ ఓటరును అడిగినా వినిపించే మాట ‘మా ఎమ్మెల్యే మంచోడు. మాకు అందుబాటులో ఉంటడు’. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన, అభివృద్ధి, సంక్షేమానికి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ మంచితనం, ప్రజలతో మమేకం అయ్యే తీరు ఆయనకు మరోసారి పట్టం కట్టనున్నాయి.
ధర్మపురి
ఈసారీ బీఆర్ఎస్దే విజయసిరి
2009లో ధర్మపురి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. వరుసగా నాలుగుసార్లు కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వరుసగా ఐదోసారీ ఆయనే బరిలో నిలిచారు. సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందని బీఆర్ఎస్కే విజయసిరి దక్కుతుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వివాద రహితుడన్న పేరు, కొప్పుల ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ కార్యక్రమాలు ఆయనకు వరుసగా ఏడో విజయాన్ని కట్టబెట్టనున్నాయి.
కోరుట్ల
గెలుపు లాంఛనమే
2009లో తొలిసారి కోరుట్ల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గెలుపొందారు. 2018 వరకు వరుసగా విజయాలు సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సంజయ్ బరిలో ఉన్నారు. సంక్షేమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న కోరుట్లలో సంజయ్‌కు ఉన్న మంచి పేరు అదనపు ఆకర్షణగా మారింది. ఈసారి కోరుట్ల కోటలో యువనేతకు పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మానకొండూర్
మళ్లీ గులాబీ రెపరెపలే
2014, 2018లో మానకొండూరులో గులాబీ జెండా రెపరెపలాడింది. ఈసారీ అదే సీన్ రిపీట్ కానున్నది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగా రు. ఉద్యమం నుంచే ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నది. రసమయి గెలి స్తే నియోజకవర్గం మొత్తానికి ఒకేసారి దళితబంధు అమలు చేయిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో 42 వేల ఓట్లు ఉన్న దళితులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కరీంనగర్
కారు స్పీడుకు ఎదురులేదు
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కరీంనగర్‌కు ప్రత్యేకంగా ఒక పేజీ ఉంటుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న గంగుల కమలాకర్ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు. నాలుగోసారి విజయానికి ‘బాటలు’ వేసుకున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా గంగుల విజయం ఖాయమైపోయిందని ప్రజలే చెప్తున్నారు.
చొప్పదండి
అభివృద్ధికే ఓటు
ఈ దఫా హ్యాట్రిక్ కొట్టనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్ ఒకరు. 2014లో ఆయన గెలిచిన తర్వాత ఇప్పటివరకు రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు జరిగి రూపురేఖలే మారిపోయాయి. ఈసారి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి మరో రూ.వెయ్యి కోట్లయినా వెచ్చించి అభివృద్ధి చేస్తామని, చొప్పదండిలో 100 పడకల ప్రభుత్వ దవాఖానాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది.
హుజూరాబాద్
ఈసారి సీఎం కేసీఆర్‌ను బాధపెట్టం
‘గత ఉప ఎన్నికల్లో మీరు నన్ను బాధ పెట్టారు. అయినా మీమీద నాకు ప్రేమ తగ్గలేదు. ఈసారి తప్పకుండా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేస్తారని భావిస్తున్నా’ అంటూ ఈ నెల 17న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హుజూరాబాద్ ఓటర్లను ఆలోచింపజేశాయి. తమ ప్రాంతం లో జరిగిన అభివృద్ధిని, ఇతర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని పోల్చుకుంటున్నారు. ఈసారి పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
మునుగోడు
ఉప ఎన్నికల ఫలితమే
2022 నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఓడించి చెంపచెళ్లుమనిపించారు. ఈ ఏడాది కాలంలోనే రూ.650 కోట్ల అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిం ది. ఈసారి గెలిపిస్తే డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల ఫలితాన్నే రిపీట్ చేయాలని ప్రజలు ఫిక్సయ్యారు. ఇక్కడ విపక్షాలకు డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
వేములవాడ
బీఆర్ఎస్కే రాజన్న ఆశీస్సులు
దక్షణ కాశీగా పేరుపొందిన వేములవాడ నియోజకవర్గంలో మొదటి నుంచీ బీఆర్ఎస్కే ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు గెలుపు పక్కా అని తేలిపోయింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున చెన్నమనేని రమేశ్‌బాబు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. న్యాయ వివాదాల నేపథ్యంలో ఈసారి లక్ష్మీనర్సింహారావును బరిలో దించింది. విద్యావేత్త కావడం, నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు.
దేవరకొండ
సిట్టింగ్ ఎమ్మెల్యేకే ప్రజల అండ
దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ బరిలో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో రవీంద్రకుమార్ వరుసగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి. దేవరకొండ పట్టణాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేశారు. 100 పడకల ఆస్పత్రి ఏర్పాటైంది. దేవరకొండలో మిగిలిన అన్ని సమస్యలకు తమదే బాధ్యత అని కేటీఆర్ ప్రకటించడంతో రవీంద్రకుమార్ గెలుపు ఖాయమైంది.
నల్లగొండ
గెలిపించడం ‘మా డ్యూటీ’
దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్లగొండలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. కంచర్ల భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారీ అదే సీన్ రిపీ ట్ కానున్నది. ఈనెల 20న జరిగిన సభలో ‘నల్లగొండ దత్తత ఇంకా పూర్తి కాలేదు. నా డ్యూటీ మిగిలే ఉంది’ అని కేసీఆర్ చెప్పడం ప్రజ ల్లో ఆనందం నింపింది. అభివృద్ధి కోసం మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు.
నాగార్జునసాగర్
నీళ్లు, నిధులు తెచ్చిన ‘నోముల’ వైపే
నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్ గెలుపు స్పష్టంగా కనిపిస్తున్నది. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య జానారెడ్డిపై విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ గెలిచాకే సాగర్ ప్రజలు అసలైన అభివృద్ధిని చూడగలిగారు. 2021లో నోముల నర్సింహయ్య మరణానంతరం ఆయన కొడుకు భగత్ బరిలో నిలిచి జానారెడ్డిపై విజయం సాధించారు. ఈసారీ అదే రిపీట్ కానున్నది. నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలైన బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలు బీఆర్ఎస్వైపే మొగ్గుచూపడం కలిసిరానున్నది.
మిర్యాలగూడ
భాస్కర్‌రావుకు అదే టర్నింగ్ పాయింట్
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు వైపే మిర్యాలగూడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో భాస్కర్‌రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గత నెల 31న సీఎం కేసీఆర్ సభకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ‘భాస్కర్‌రావు నా కుడి భుజం లాంటోడు… అన్ని కీలక నిర్ణయాల్లో నా వెంటే ఉంటాడు’ అంటూ కేసీఆర్ ప్రకటించడం టర్నింగ్ పాయింట్‌గా మారింది.
రామగుండం
మలుపుతిప్పిన రామన్న దత్తత ప్రకటన
సింగరేణి, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంపై మరో మారు గులాబీ జెండా ఎగురనున్నది. ఉద్యమ నేత కోరుకంటి చందర్ రెండోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించనున్నారు. చందర్‌ను గెలిపిస్తే రామగుండాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించడంతో పరిస్థితులు బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి.సింగరేణి ద్వారానే రాష్ట్రంలోని అన్ని రకాల మైనింగ్లను చేపడతామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో రామగుండంలో చందర్ గెలుపు ఖాయమైంది.
నకిరేకల్
నాలుగేండ్లలోనే రూ.900 కోట్ల పనులు
నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాలుగేండ్లలోనే సుమారు రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన లింగయ్య వైపే ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. కీలకమైన బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ నెల 20న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల పూర్తితో పాటు రామన్నపేటకు కాళేశ్వరం జలాలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
సూర్యాపేట
జగదీశన్నకే మరోసారి జై
2014 నుంచి సూర్యాపేట నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సూర్యాపేట జిల్లా కావడం దశాబ్దాల కల. దానిని నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది, జగదీశ్ రెడ్డిదే అని ప్రజలు స్వయంగా చెప్తున్నారు. కాళేశ్వరం ద్వారా 1.20లక్షల ఎకరాలకు గోదావరి జలాలకు పారుతుండడం సూర్యాపేట రూపురేఖలు మారిపోయాయి. జగదీశ్‌రెడ్డి మరోసారి ఉన్నత స్థానంలో ఉంటాడని కేసీఆర్ ప్రకటించడంతో ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమైంది.
తుంగతుర్తి
2 వేల కోట్ల అభివృద్ధిని ఎలా వదులుకుంటాం?
‘గాదరి కిశోర్ గెలిచిన తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి చేశారు. అలాంటి వ్యక్తిని ఎలా వదులుకుంటాం?’ అన్నది తుంగతుర్తి ప్రజల నుంచి వస్తున్న మాట. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ వరుసగా విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం కిశోర్‌కుమార్ బరిలోకి దిగారు. పూర్తిగా వెనుకబడిన తుంగతుర్తి నేడు అభివృద్ధి పథంలో ముందుంది. అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుండడంతో ఆయనను వదులుకునేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరు.
కోదాడ
బీడు భూములకు నీళ్లు.. బీఆర్ఎస్కే ఓట్లు
కోదాడ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు లాంఛనమే అన్నది అక్కడి ప్రజల మాట. ఈ నియోజకవర్గంలో 2014లో కాంగ్రెస్ విజయం సాధించగా 2018లో బీఆర్ఎస్ గెలుపు సాధింంచింది. కోదాడలో బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధికి అడుగులు పడ్డాయి. రూ.2400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మల్లయ్యయాదవ్‌ను గెలిపిస్తే కోదాడ బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రజల్లో మరింత ఉత్సాహంతో ఉన్నారు.
హుజూర్నగర్
‘ఉత్త’ మాటల కన్నా.. అభివృద్ధికే పట్టం
2009 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా గెలుపొందారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 మే లో ఎంపీగా కూడా గెలువడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికల హామీలతో కలిపి రూ.4వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టారు. చిరకాలం డిమాండ్‌గా ఉన్న రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అభివృద్ధివైపే నిలవాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు.
భువనగిరి
ప్రశాంతత, అభివృద్ధికే పట్టం
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. 2014, 2018 లో వరుసగా బీఆర్ఎస్ తరఫున పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ గెలుపు తర్వాతే భువనగిరి అభివృద్ధికి బాటలు పడ్డాయి. భువనగిరి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కావడం టర్నింగ్ పాయింట్‌గా మారింది. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం అదనపు హంగులుగా నిలిచాయి. జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా మంజూరైంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శేఖర్‌రెడ్డి వైపే గాలివీస్తున్నది.
ఆలేరు
రూ.3 వేల కోట్ల అభివృద్ధికే పట్టం
ఆలేరు నియోజకవర్గం ఉద్యమ సమయంలోనే రెండుసార్లు బీఆర్ఎస్ను ఆశీర్వదించింది. 2014, 2018లలో గొంగిడి సునీత బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలుపొందారు. బీఆర్ఎస్ గెలుపుతో ఆలేరు ముఖచిత్రం మారిపోయింది. రాష్ర్టానికే ఆధ్యాత్మికంగా తలమానికమైన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని రూ.1289 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలేరుకు దేశవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. ఇక బీడుభూముల్లో కాళేశ్వరం జిలాలు పారుతున్నాయి. ఇలాంటి అభివృద్ధిని వదులుకునేందుకు ఆలేరు ప్రజలు సిద్ధంగా లేరు.