గుడ్డెద్దు చేనులో పడితే తిన్నకాడికి తిని, తొక్కేసిన కాడికి తొక్కేస్తది. ఆఖరికి దాని కడుపు మాత్రం నింపుకొనుడు పక్కా. కాంగ్రెస్ పాలకులూ అంతే, తమ జేబులు నింపుకొనేందుకే చూశారు తప్ప జనం బర్బాత్ అయిపోతారన్న సోయే లేదు వాళ్లకు. కొండ నాలుకకు మందు వేయబోయి ఉన్న నాలుకను ఊడగొట్టినంత పనే చేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ హయాంలో వెలిసిన దేవాదుల ఎత్తిపోతల, కంతనపల్లి బరాజ్ వారి పాపాలకు నిదర్శనంగా నిలుస్తాయి. అయితే, సొంత రాష్ట్రంలో నాటి పాలకుల పాపాలకు ప్రాయశ్చితంగా మారింది తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బరాజ్. నిరుపయోగంగా మారిన దేవాదులకు సమ్మక్క బరాజ్‌తో జలకళ వచ్చింది.
కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసిన దేవాదుల ఎత్తిపోతల పథకం ఏడాది పొడవునా నీళ్లు లేక ఎడారిగా మారింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గంగారం సమీపంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. వానకాలంలోనే నీళ్లు ఉండడంతో 70 రోజులు మాత్రమే ఎత్తిపోతల పథకం పనిచేసేది. ఎండకాలం వస్తే ఇసుక దిబ్బలు తేలి ఎడారిగా మారిపోయేది. ఈ పథకం ద్వారా 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నిష్ప్రయోజనమయ్యింది.

ఊళ్లను ‘ముంచే’ ప్రయత్నంలో ‘చేతు’లు కాలి..
ఆ తర్వాత రిజర్వాయర్ నిర్మిస్తేనే ఉపయోగంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ ఊళ్లను ‘ముంచే’ ప్రయత్నంలో ‘చేతు’లు కాల్చుకున్నది. ఆ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో 2009, ఫిబ్రవరి 2న మండలంలోని కంతనపల్లి వద్ద రూ.10,409 కోట్లతో బరాజ్ నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేసింది. ఇక మట్టి పనులు తవ్వేసి వదిలేసింది. దేవాదుల ఇన్‌టేక్‌వెల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంతనపల్లి వద్ద బరాజ్ నిర్మాణం చేపడితే వేలాది ఎకరాల పంట భూములు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామాలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది.
సొంత రాష్ట్రంలో తుపాకులగూడెం వద్ద బరాజ్
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కంతనపల్లిని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆయన దేవాదుల ఇన్‌టేక్‌వెల్‌కు దిగువ భాగంలోని ఐదు కిలోమీటర్ల దూరంలో తుపాకులగూడెం వద్ద రూ.1,650 కోట్లతో గోదావరిపై 1,120 మీటర్ల పొడవునా 59 గేట్లతో సమ్మక్క బరాజ్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.29 టీఎంసీలు. దీని నిర్మాణంతో దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద 79 మీటర్ల నీటి నిల్వ ఉంటున్నది. ఫలితంగా 24 గంటలపాటు మోటర్లు నడుస్తున్నాయి. మొత్తం మూడు మోటర్లకు.. ఇప్పుడు రెండు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి నీటిని భీంఘనపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు.
కేసీఆర్ చొరవతో వినియోగంలోకి దేవాదుల ఎత్తిపోతలు
సమ్మక్క బరాజ్ నిర్మాణం చేపట్టకముందు ఎడారిగా కనిపించిన దేవాదుల ఇన్‌టేక్ వెల్ నేడు నిత్యం జలసిరితో దర్శనమిస్తున్నది. నిరుపయోగం అవుతుందనుకున్న దేవాదుల ఎత్తిపోతల పథకం సీఎం చొరవతో వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం భీంఘనపూర్ రిజర్వాయర్ నుంచి ధర్మసాగర్ వరకు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా పంపిస్తున్నారు. ఎడారిగా మారుతుందనకున్న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ సుజల స్రవంతిగా నిండుకుండలా గోదావరి విరాజిల్లుతున్నది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని వ్యవసాయ భూములు, ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు గోదావరి వరద చేరుతున్నది.
…? నూక ప్రభాకర్
