Akbaruddin Owaisi | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఒవైసీ పాల్గొంటూ.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గత పదేండ్లలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని ప్రశంసించకుండా ఉండలేమని అన్నారు. జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ సగటును దాటిపోయిందని, ఈ విషయాన్ని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. గత రెండేండ్ల నుంచి జీఎస్డీపీ జాతీయ వృద్ధిరేటుకన్నా తక్కువగా నమోదవుతున్నదని అన్నారు. ‘గత పదకొండేండ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వడంలేదు.
ముఖ్యమంత్రిసహా మంత్రులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నా, వినతిపత్రాలు ఇస్తున్నా ఫలితం ఉండడంలేదు. ఇప్పటికే సీఎం 39 సార్లు ఢిల్లీ వెళ్లినట్లు చూశాను. బడేభాయి ఛోటే భాయిని కాపాడడంలేదు. కేంద్రం ఇంత వివక్ష చూపుతున్నా రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం విచారకరం. దీనిపై మేము మొదటినుంచీ ఆందోళన చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర విభజన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రాజక్టులకు ఎటువంటి సహాయం అందించలేదు’ అని విమర్శించారు. పేర్లు మార్చడంపై చర్చను పక్కకుపెట్టి రాష్ర్టానికి రావాల్సిన వాటాను రాబట్టేందుకు సభ్యులు కృషిచేయాలని సూచించారు. ‘నేను 1999లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పటివరకు 26 బడ్జెట్లు చూశాను. రాష్ట్ర అభివృద్ధికి అందరు ముఖ్యమంత్రులు కృషిచేశారు. విపక్షాలు కూడా తమవంతుగా మరింత అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం సహజం’ అని అన్నారు.