Dy CM Mallu Batti Vikramarka | రాష్ట్రంలో మరోమారు కుల గణన జరుగనున్నది. ఈ నెల 16-28 మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, మల్లు భట్టి విక్రమార్క బుధవారం మీడియాకు చెప్పారు. కుల గణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అటుపై అసెంబ్లీ ఆమోదంతో శాసనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం బిల్లును ఆమోదిస్తామన్నారు.
అటుపై బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదించేలా కృషి చేస్తాం అని చెప్పారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నేతలను కలుస్తాం అని పేర్కొన్నారు. దీంతో స్థానిక సంస్థలు మరోమారు ఆలస్యం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి.