‘జీబీ లింక్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్లకు మళ్లిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదొక పెద్ద గేమ్ చేంజర్’.. ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెప్తున్న మాట ఇది.
ఆయన చెప్తున్నట్టుగానే జీబీ లింక్ పూర్తయితే ఏపీలోని మూలమూలకూ గోదావరి పరవళ్లు తొక్కుతుంది. అందుకు అవసరమైన కెనాల్ నెట్వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. మరి తెలంగాణ సం‘గతేంది’?
జీబీ లింక్‌తో గోదావరి కృష్ణాను దాటి, పెన్నాను ముద్దాడి అక్కడి నుంచి కావేరిని కలుస్తుంది. అదే జరిగితే కృష్ణా జలాల్లో ఇప్పటికే మోసపోయి గోసపడుతున్న తెలంగాణ.. ఇకపై గోదావరిజలాల్లోనూ నిండా మునుగుతుంది.
జల హక్కులన్నీ కోల్పోయి తెలంగాణ ఎడారిగా మిగిలే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరిని చెరబట్టే ఏపీ ప్రణాళికలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుండగా, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మౌనంగా చూస్తున్నది.
Godavari River | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యామ్ నుంచి కుడి కాలువ ద్వారా ప్రకాశం బరాజ్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి జలాలను కొత్తగా నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, ఆపై బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి మళ్లిస్తారు. ఇదీ క్లుప్తంగా జీబీ లింక్ ప్రాజెక్టు ప్రణాళికని ఏపీ చెప్తున్నది. కానీ బనకచర్లకు జలాలను తరలిస్తే ఇప్పటికే పెన్నా బేసిన్లో ఏపీ నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు జలాలను తరలించవచ్చు. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరి నదికి సైతం మళ్లించవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించిన కెనాల్ నెట్వర్క్ మొత్తం సిద్ధంగా ఉన్నది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇప్పటికే కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్న ప్రతీ ఏపీ ప్రాజెక్టుకు రాబోయే రోజుల్లో గోదావరి జలాలను కూడా మళ్లించనున్నారు. 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టారు.
కృషా ్ణబేసిన్ నుంచి పెన్నా బేసిన్‌లోని చిట్టచివరి ప్రాంతాలకు సైతం కృష్ణా జలాలను తరలించేందుకు కుట్రలకు తెరలేపారు. అందులో భాగంగా పోతిరెడ్డిపాడు విస్తరణకు పూనుకున్నారు. పీఆర్పీ హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. కృష్ణా జలాల దోపిడీకి అక్రమంగా గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ ప్రాజెక్టులను చేపట్టారు. పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను యథేచ్ఛగా మళ్లించడం ప్రారంభించారు. మళ్లించిన జలాల నిల్వకు పెన్నా బేసిన్లో అనేక రిజర్వాయర్లను భారీ సామర్థ్యంతో నిర్మించారు. పెన్నా బేసిన్లో మొత్తంగా 42 రిజర్వాయర్లను ఏర్పాటు చేయగా, ఒక్క పెన్నా నదిపైనే ఎగువ నుంచి దిగువకు రివర్పైనే 11 రిజర్వాయర్లు నిర్మించారు. పెన్నా బేసిన్లో ఇప్పటికే 350 టీఎంసీల జలాల నిల్వ సామర్థ్యమున్నది. ప్రధాన రిజర్వాయర్లకు అనుబంధంగా అనేక చిన్నపాటి రిజర్వాయర్లను కూడా నిర్మించారు. ఆయా నీటి కాలువలను చెరువులకు సైతం అనుసంధానించారు. కృష్ణాలో వరద వచ్చిందంటే చాలు పోతిరెడ్డిపాడు ద్వారా బనకచర్ల మీదుగా కృష్ణా జలాలను పెన్నాకు మళ్లించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు జీబీ లింక్ ద్వారా గోదావరి జలాలను పెన్నాబేసిన్‌లోని ప్రతి బేసిన్‌కూ తరలించడమే లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతున్నది.
పెన్నా బేసిన్లో ఇప్పటికే 350 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యముండగా జీబీ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ మరో భారీ రిజర్వాయర్ ను నిర్మించేందుకు సిద్ధమైంది. పల్నాడు జిల్లా లో బొల్లాపల్లి గుట్టలను కలిపి 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు సిద్ధమైంది. పల్నాడు జిల్లా లో 15 ముంపు గ్రామాలపైనా ఇప్పటికే సర్వే చేయించింది. పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్యం పెంపు పనులను నిర్వహిస్తున్నది. గాలేరి నగరి, అవుకు జలాశయాల మధ్య కాలువల సామర్థ్యాలను 12,735 క్యూసెక్కు ల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలనే కాదు, కృష్ణా జలాలనూ తరలించే అవకాశం ఉన్నది.
నాగార్జునసాగర్ కుడి కాల్వనే ఓ రిజర్వాయర్‌గా మార్చి బనకచర్లకు తరలించేలా ప్లాన్ చేసింది. జీబీ లింక్ ప్రాజెక్టు 2వ దశలో ప్రకాశం బరాజ్ బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలను ఆరు లిఫ్ట్‌ల ద్వారా ఎత్తిపోయనుంది. అందు లో భాగంగా ప్రకాశం బరాజ్, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద అదనం గా ఓ బరాజ్‌ను నిర్మించాలని ఏపీ సమాలోచనలు చేస్తున్నది. అదేవిధంగా సాగర్ కుడి కాల్వను 80వ కి.మీ పాయింట్ వద్ద వెడల్పు చేసి, ఓ రిజర్వాయర్లా మార్చేందుకు ఎత్తుగడ వేసింది. అకడి వరకు ఐదు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి, కుడి కాల్వ పాయింట్ తర్వాత మరో లిఫ్ట్‌ను నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపునకు పూనుకున్నది. గోదావరి జలాలను రాబోయే రోజుల్లో సాగర్ కుడి కాల్వకూ మళ్లించే ప్రణాళికలను అమలు చేస్తున్నది. ప్రస్తుతం బనకచర్ల వరకే 2 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తామని చెప్తు న్నా, దిగువన సోమశిలకు సైతం అదనంగా ఒక టీఎంసీని తరలించే ప్రణాళికలను సైతం ఏపీ సిద్ధం చేస్తున్నది.
తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ పొడ వు 189 కి.మీ. 105కి.మీ వరకు కర్ణాటకలో, అక్కడి నుంచి 189వ కి.మీ. వరకు ఏపీలోని అనంతపురం జిల్లా గుండా పోతుంది. ఈ కాలువ నుంచి ఆ జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్, పెన్నార్ అహోబిలం రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ హెచ్ఎల్సీ ద్వారా ఏపీకి 32 టీఎంసీల జలాల కేటాయింపులు ఉన్నా యి. అవార్డులకు విరుద్ధంగా కడప- కర్నూల్ (కేసీ) కెనాల్‌కు సైతం అదనంగా దాని నుంచే జలాలను మళ్లిస్తున్నారు. కేవలం కృష్ణాకు వరదలు వచ్చిన క్రమంలో వాటిని తక్కువ సమయంలోనే తరలించి అనంతపురం జిల్లాలకు అందిస్తామని చెప్తూ ఏపీ సర్కారు ప్రతిపాదనలు చేసింది. హెచ్ఎల్సీ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు ఏపీలోని టీడీపీ సర్కారు శరవేగంగా ముందుకు వెళ్తున్నది.
కృష్ణా ట్రిబ్యునల్ అవా ర్డు ప్రకారం కేసీ కెనాల్‌కు సుంకేసుల బరాజ్ నుంచి తుంగభద్ర నదీ జలాలను మాత్రమే వాడుకోవాలి. అందుకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అనుమతుల్లేని మల్యాల, ముచ్చుమర్రి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్ స్కీం పంపిం గ్ స్టేషన్ 1, ముచ్చుమర్రి వద్ద కేసీ కెనాల్ లిఫ్ట్ సీం ద్వారా, పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల వద్ద నాలుగు అదనపు మార్గాల ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు మళ్లిస్తున్నది. అంతేకాదు తుంగభద్ర డ్యామ్ కుడివైపు హై లెవెల్ కెనాల్ ద్వారా కూడా మళ్లిస్తున్నది. అందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. తుంగభద్ర, కృష్ణా జలాలన్నీ ఇప్పటికే పెన్నా బేసిన్‌కు తరలిపోనుండగా, రాబోయే రోజుల్లో జీబీ లింక్ ద్వారా గోదావరి జలాలు సైతం మళ్లిపోనున్నాయి.
పోలవరం ప్రాజెక్టు కుడివైపునే కాదు ఎడమవైపునా ఏపీ అనేక అక్రమ లిఫ్ట్‌లను ఏర్పాటు చేసింది. కుడి కాలువపై పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఆయకట్టుకు నీటిని అందించడానికి తాత్కాలికంగా పట్టిసీమ, పుష్కర లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన అనంతరం వాటిని తొలగిస్తామని చెప్పింది. కానీ ఆచరణలో ఆ రెండింటింతోపాటు చాగల్నాడు, తొర్రిగడ్డ, తాడిపూడి, తదితర ప్రాజెక్టులను ఏర్పాటు చేసి గోదావరి జలాలను తరలిస్తున్నది. ఇదిలా ఉంటే పోలవరం ఎడమ కాలువపైనా అక్రమంగా లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటు చేసింది.
పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. అదేవిధంగా వెంకటనగరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతపూడి రెండో దశల ప్రాజెక్టులను కూడా చేపట్టింది. వంశధార, నాగావళితోపాటు అనేక సబ్బేసిన్లను అనుసంధానిస్తూ కెనాల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. వాటన్నింటికీ తోడు పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి కూడా 18 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం ఎత్తిపోతల పథకం పనులను కూడా చేపట్టడం గమనార్హం. మొత్తంగా కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను సైతం చెరబట్టేందుకు ఏపీ ప్రణాళికలను అమలు చేస్తున్నది.