Cyber Fraud | తెలంగాణతోపాటు 13 రాష్ట్రాల్లో అనేక సైబర్ నేరాలకు పాల్పడిన సైబర్ మోసగాడు షేక్ ఖలీల్‌ను విశాఖపట్నంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. విశాఖపట్నం నివాసి షేక్ ఖలీల్ (32) అనే నిందితుడిని ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నంలో అరెస్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 120(బి), 419, 420 ఆర్/డబ్ల్యూ, 149 సెక్షన్లతోపాటు ఐటీ చట్టం 66డీ సెక్షన్ కింద నిందితుడిపై ఖమ్మం సైబర్ క్రైమ్ సీపీఎస్ లో కేసు నమోదైంది.
ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో షేక్ ఖలీల్ డబ్బులు దోచుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 51 ఏళ్ల హెడ్మాస్టర్తో సహా అనేక మంది అమాయకులను బెదిరించిన మోసాలకు పాల్పడ్డాడు. 51 ఏండ్ల హెడ్మాస్టర్ తన బ్యాంకు ఖాతాల నుంచి రూ.3.5 లక్షలు కోల్పోయాడు. దీనిపై ఆయన ఖమ్మం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ అధికారులు ఈ నెల 8న విశాఖపట్నంలో షేక్ ఖలీల్‌ను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా షేక్ ఖలీల్ మొబైల్ ఫోన్లు, బ్యాంక్ చెక్ బుక్కులు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని ఖమ్మం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు తెలంగాణతోపాటు దేశంలో 33 సైబర్ నేరాలకు పాల్పడినట్లు తేలింది. అదనపు నేరాలు, వాటి ఆధారాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు త్వరలో నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. నిందితుడు షేక్ ఖలీల్‌ను గుర్తించి అరెస్ట్ చేసిన డీఎస్పీ ఫణేంద్ర, ఎస్ఐ రంజిత్ నేతృత్వంలోని ఖమ్మం సీసీపీఎస్ బృందాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.
పోలీసులు, ఏదైనా చట్టబద్ధమైన సంస్థ కేసును క్లియర్ చేయడానికి గానీ, ఎవరినైనా వీడియో కాల్స్‌లో పాల్గొనడానికి డబ్బులు డిమాండ్ చేయరని శిఖా గోయల్ తెలిపారు. చట్టబద్ధమైన సంస్థ నుండి వచ్చినట్లు చెప్పుకునే కాల్స్ వస్తే, భయపడవద్దని, స్థానిక పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.