హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నూటికి 104% పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. 2021-22లో 101%, ఆ తర్వాత సంవత్సరాల్లో 94% వరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు నెలలు గడిచినప్పటికీ, 70% మాత్రమే మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయినట్టు అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో వనమహోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను బట్టి మొక్కల లక్ష్యాన్ని నిర్ధారించాల్సి ఉంటుందని, ఆ నివేదిక ఆధారంగానే ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. నాటడానికి కావాల్సిన మొక్కలు, స్థలాలు అందుబాటులో ఉండటం, లేకపోవడం అనేది కలెక్టర్ల నివేదికల మీద ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ‘మొక్కల పెంపకం ఎక్కడా?’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన వార్తకు ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించడం కోసం అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా.. ఇప్పటివరకు 69.57% మొక్కలు మాత్రమే నాటడం పూర్తయిందని, మిగిలిన మొక్కలు నాటాల్సి ఉన్నదని తెలిపారు. మొక్కలు నాటుతున్న వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో ఉంచుతున్నట్టు చెబుతున్నారే తప్ప.. ఎప్పటిలోగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ పథకం మొత్తం తూతూ మంత్రంగానే కొనసాగుతున్నదే తప్ప, నాటిన మొక్కల జాడ ఎక్కడా కనిపించడం లేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.